సమైక్యంగానే ఉందాం

2 Nov, 2013 06:15 IST|Sakshi

అన్నానగర్, న్యూస్‌లైన్:
 ఎన్ని సమస్యలు, సంక్షోభాలు ఎదురైనా మనమంతా సమైక్యంగానే ఉండాలని నగరానికి చెందిన తెలుగు ప్రముఖులు తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా మైలాపూర్ పొట్టి శ్రీరాములు స్మారక మందిరంలో ఏర్పాటు చేసిన ‘ఆంధ్రప్రదేశ్ అవతరణ నేపథ్యం’ అనే అంశంపై ఏరాపటుచేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు ఉపన్యసించారు. ఈఎస్ రెడ్డి మాట్లాడుతూ మద్రాసు ప్రెసిడెన్సీలో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావ రి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో మాత్రమే ఉండేవని గుర్తుచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండడంతో ఆంధ్రుల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాలనే కోరికను బలపరిచిందని తెలియజేశారు. ఫలితంగా 1912 మే నెలలో నిడదవోలులో మొట్టమొదటి సారిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ప్రతిపాదన చేశారన్నారు.
 
  1913 మే 20న గుంటూరు జిల్లా బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభ జరిగిందన్నారు. ఇందులో భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రముఖ పాత్ర పోషించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారని తెలియజేశారు. 1914న విజయవాడ, కాకినాడల్లో జరిగిన రెండు, మూడు ఆంధ్ర మహాసభల్లో భోగరాజు, కొండా వెంకటప్పయ్య కలిసి భారత రాష్ట్రాల పునర్నిర్మాణంపైన కరపత్రాలను రూపొదించి దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ వాదులకు పంచారని పేర్కొన్నారు. దీంతో 1914లో మద్రాసులో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో ప్రత్యేకాంధ్రపై తొలిసారిగా జాతీయ స్థాయి చర్చ జరిగిందన్నారు.
 
 మొదటి నుంచీ చిన్నచూపే
 ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో జాతీయ నాయకులు అందరూ తొలి నుంచి చిన్నచూపే చూశారని రెడ్డి విమర్శించారు. నెహ్రూ, పటేల్‌పై నిరంతర ఒత్తిడి తేవడం వల్ల 1949లో కాంగ్రెస్ జేవీపీ కమిటీని ఏర్పాటు చేసి మద్రాసును ఆంధ్రులు వదులుకునే పక్షంలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని షరతు విధించారన్నారు. టంగుటూరి ప్రకాశం, బెజవాడ గోపాలరెడ్డి, కళా వెంకటరావు, నీలం సంజీవరెడ్డి తదితరులు దీన్ని వ్యతిరేకించారన్నారు. గొల్లపూడి సీతారామశాస్త్రి 35 రోజులు చేసిన ఆమరణ దీక్ష సైతం జాతీయ నాయకులను కరిగించలేకపోయిందన్నారు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో రాజాజీ మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రి అయినా కృష్ణా-పెన్నా ప్రాజెక్టు వివాదంలో చిక్కుకున్నారన్నారు. దీంతో ఆంధ్రులకు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవాలనే కోరిక పూర్తిగా బలపడిందని చెప్పారు.
 
 ఆంధ్రులకు మద్రాసులో జరుగుతున్న అన్యాయాన్ని నిరసి స్తూ పొట్టి శ్రీరాములు దీక్షకు దిగి మరణించడంతో హింసాత్మక సంఘటనలు చెలరేగడం నెహ్రూకు దడ పుట్టించిందన్నారు. ఈ సంఘటనలతో నెహ్రూ 1952 డిసెంబరు 19న ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారన్నారు. ఆ విధంగా ఆంధ్రాలో ధైర్యంతో ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించారన్నా రు. తెలుగువారికి తొలుత శ్రీకాకుళం, కర్నూలు, అమరావతి రాజధానులుగా ఉండేవన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బషీర్, రామకృష్ణ, జేకే రెడ్డి, నాగరాజు, నాగసూరి వేణుగోపాల్, జీవీఎస్సార్ కృష్ణమూర్తి, రచయిత్రి ఆముక్త మాల్యాదులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు