రాష్ట్రానికి రాష్ట్రపతి

8 Sep, 2016 02:46 IST|Sakshi

సాక్షి, చెన్నై : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి రానున్నారు. ఈనెల తొమ్మిది, పది తేదీల్లో ఆయన పర్యటన సాగనున్నది. ఇందు కోసం భారీ భద్రతా ఏర్పాట్లు సాగుతున్నాయి.నీలగిరి జిల్లా వెల్లింగ్‌టన్‌లో ఆర్మీ శిక్షణ కేంద్రం ఉన్న విషయం తెలిసిందే.

 ఇక్కడ దేశ విదేశాలకు చెందిన అధికారులకు ప్రత్యేక శిక్షణలు ఇవ్వడం జరుగుతూ వస్తోంది. 34 దేశాలకు చెందిన వాళ్లు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. వీరిలో 420 మంది అధికారుల శిక్షణ  కాలం ముగిసింది. ఇక, విధుల్లోకి వెళ్లబోతున్న ఈ అధికారులు కలర్ ప్రజంటేషన్ పేరుతో తమ ప్రతిభను చాటబోతున్నారు.
 
  అలాగే, మెడల్స్ ప్రదానం, శిక్షణ  కాలంలో నేర్చుకున్న అంశాలను చాటే ప్రదర్శన సాగబోతున్నది. అలాగే, చెన్నై సెయింట్ థామస్ మౌంట్‌లోనూ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ శిక్షణ ముగించుకున్న వారి పరేడ్‌కు తగ్గ ఏర్పాట్లు చేశారు. ఈ రెండు కార్యక్రమాలు తొమ్మిది, పది తేదీల్లో జరగనున్నాయి. ఇందులో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొననున్నారు. ఆయన రాకతో వెల్లింగ్‌టన్, సెయింట్ థామస్ మౌంట్ ఆర్మీ శిక్షణ  కేంద్రాలు నిఘా నీడలోకి వచ్చాయి. వెల్లింగ్‌టన్ పరిసరాల్లో భద్రతను ఆరు అంచెలకు పెంచారు. నీలగిరి వైపుగా వెళ్లే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.
 
 చెన్నై నుంచి కోయంబత్తూరు, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వెల్లింగ్‌టన్ హెలిపాడ్‌కు రాష్ట్రపతి చేరుకుంటారు. అయితే, ఆ హెలిపాడ్‌కు ప్రత్యామ్నాయంగా తిట్టకల్ వద్ద కూడా మరో హెలిపాడ్‌ను సిద్ధం చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో మునిగి ఉండే నీలగిరిలో ఏదేని వాతావరణ సమస్య ఎదురైనా, హెలికాప్టర్ ల్యాండింగ్‌కు తగ్గట్టుగా సర్వం సిద్ధం చేసి ఉన్నారు. అందుకే రెండు హెలిపాడ్‌లను సిద్ధం చేసి, ఆ పరిసరాల్ని నిఘా నీడలోకి తెచ్చారు. తొమ్మిదో తేదీ పర్యటన ముగిసినానంతరం పదో తేదీన చెన్నై సెయింట్ థామస్ మౌంట్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు.

మరిన్ని వార్తలు