ఛట్‌పూజ ప్రారంభం

6 Nov, 2013 23:07 IST|Sakshi
సాక్షి, న్యూఢిల్లీ: పూర్వాంచలీయుల సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన ఛట్‌పూజ నగరంలో బుధవారం నుంచి ప్రారంభమైంది. నగరంలో పూర్వాంచలీయుల సంఖ్య కూడా పెరుగుతుండడంతో ఈ పండుగపై రాజకీయ నాయకులు కూడా దృష్టిసారించారు. పూజలు జరిగే నదీతీరాలను శుభ్రపరిచే పనులను ఇప్పటికే పూర్తి చేశారు. నాలుగురోజులపాటు జరుపుకునే ఈ వ్రతంలో తొలిరోజైన నహాయ్‌ఖాయ్‌ను సంప్రదాయంగా జరుపుకున్నారు. రెండో రోజైన ‘ఖర్నా’ను జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఛట్ పూజను ప్రధానంగా నాలుగు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును నహాయ్ ఖాయ్, రెండోరోజును ఖర్నా, మూడవ రోజును పెహలా ఆర్ఘ్య్, నాలుగవరోజును పార్నాగా పేర్కొంటారు. ఛట్ పూజ చేసేవారు అత్యంత నిష్టగా నహాయ్‌ఖాయ్ ఆచరిస్తారు. ఎక్కువగా మహిళలే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
 
 ఇల్లంతా శుభ్రపరచుకుని, శుచిగా స్నానం చేస్తారు. వ్రతధారులే స్వయంగా పీలి మట్టితో పొయ్యి తయారుచేసి మామిడి కట్టెలను ఉపయోగించి అర్వాచావల్, శనగపప్పు, సొరకాయ లేదా అరటికాయ  కూరతో తయారుచేసిన వంటకాన్ని ఆరగిస్తారు. వంటలో సాధారణంగా ఉప్పు  వినియోగించరు.  ఒకవేళ వాడినా సైంధవ లవణాన్ని మాత్రమే వాడుతారు. సొరకాయ ఈ రోజున వంటలో ప్రధానంగా వాడుతారు కనుక నహాయ్ ఖాయ్ భోజనాన్ని కొందరు కద్దూబాత్‌గా పేర్కొంటారు. వ్రతధారులు రాత్రి ప్రసాదం తరువాత మరుసటి రోజు సాయంత్రం వరకు  ఉపవాసముంటారు. ఈ రోజును ఖర్నాగా పేర్కొంటారు. సాయంత్రం ఖీర్, రొట్టెలను ప్రసాధంగా స్వీకరించి నిర్జల ఉపవాసాన్ని ప్రారంభిస్తారు. మూడవ రోజున అస్తమించే సూర్యున్ని పూజించి చాటలో ప్రసాదాన్ని సమర్పిస్తారు. నాలుగో  రోజున ఉదయించే సూర్యునికి ఆర్ఘ్యప్రసాదాలు సమర్పించి వ్రత విసర్జన చేసి విందు భోజనం చేయడంతో వ్రతం పూర్తవుతుంది. 
 
 పెరుగుతున్న ఆదరణ...
 సువిశాల భారతదేశం వైవిధ్యానికి నెలవు. ఈ వైవిధ్య భరితమైన సంస్కృతి, వేషధారణ, ఆచారాలు, వ్యవహారాల్లోనే కాకుండా పండుగలలో కూడా కనబడుతుంది.  దీపావళి, దసరా వంటి పండుగలు యావద్దేశం ఆనందోత్సాహాలతో జరుపుకుటున్నప్పటికీ  కొన్ని ప్రాంతాలలో జరుపుకునే పండుగల గురించి మిగతా ప్రాంతాల వారికి పెద్దగా తెలియదు.  ఉదాహరణకు కేరళ వాసుల అతి పెద్ద పండుగ ఓనమ్ గురించి మిగతా ప్రాంతాల ప్రజలకు తెలియదు. తెలంగాణవాసులు అత్యుత్సాహంతో జరుపుకునే  బతుకమ్మ వేడుక గురించి పక్కనే ఉన్న సీమాంధ్ర ప్రాంతాల వారికి తెలియదు. ఇలా ఆయా ప్రాంతాలకే ప్రత్యేకమైన పండుగలు, పర్వదినాలు ఎన్నో ఉన్నాయి. ఈ కోవలోకే వస్తుంది పూర్వాంచలీయులు జరుపుకునే ఛట్ పూజ. ఛట్ పూజ గురించి రెండు దశాబ్దాల కిందటి వరకు ఢిల్లీవాసులకు కూడా పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
 
  నగరంలో పూర్వాంచలీయుల సంఖ్య భారీగా పెరగడంతో  ఇప్పుడు ఈ పూజ సందడి నగరమంతటా దర్శనమిస్తోంది. ఒకప్పుడు ఛట్ పూజ కోసం  పూర్వాంచలీయులే స్వయంగా ఘాట్లను శుభ్రపరచుకుని అన్ని ఏర్పాట్లు చేసుకునేవారు. పూజ సామగ్రిని ఉత్తర ప్రదేశ్, బీహార్‌ల నుంచి తెప్పించుకునేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే ఈ పూజ కోసం దాదాపు 70 ఘాట్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పూజా సామగ్రి కూడా ఇప్పుడు నగరంలోని అన్ని మార్కెట్లలో లభిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం  2000 సంవత్సరంలో ఛట్ పూజ రోజును ఐచ్చిక సెలవుగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా 2011లో ఛట్‌పూజ రోజును ప్రాంతీయ సెలవుగా ప్రకటించింది. 
 
 తాము అధికారంలోకి వచ్చినట్లయితే ఛట్ పూజ రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తామని బీజేపీ చెబుతోంది. ఆసియా  క్రీడల సమయం నుంచి నగరానికి పూర్వాంచలీయుల వలసలు పెరిగాయని, ఉపాధికోసం నగరానికి వచ్చిన  వారు పాలం, సంగమ్ విహార్, డాబ్రీ, ఉత్తం నగర్, కిరాడీ, సాగర్‌పూర్, సీమాపురి, మంగోల్‌పురి తదితర ప్రాంతాలలో నివాసమేర్పరచుకుని యమునా తీరాన ఛట్ పూజ చేసుకునేవారని,  లక్షలాది మంది  పూర్వాంచలీయులు ఈ వేడుకలకు హాజరుకావడం గమనించి  రాజకీయ నాయకులు, ప్రభుత్వం కూడా ఈ పూజ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం ప్రారంభించారని నగరంలో 30 సంవత్సరాలుగా నివాసముంటోన్న పూర్వాంచలీయులు చెప్పారు. 
 
 ఛట్ పూజ కూడా కూడా బతుకమ్మ పండుగ మాదిరిగానే ప్రకృతికి సన్నిహితమైనది. సక ల సృష్టికి ఆధారమైన సూర్యభగవానున్ని ఈ పండుగ సందర్భంగా కొలుస్తారు. మోకాలి లోతు వరకు నీటిలో నిలబడి సూర్యదేవునికి ఆర్ఘ్యప్రసాదాలను సమర్పించడం ఈ పూజ ప్రత్యేకత. వెదురు గంప లేదా చాటలో పళ్లను ఉంచి  అస్తమించే సూర్యునికి, ఉదయించే సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ పూజలో ప్రధాన భాగం నదీతీరాన జరుగుతుంది కాబట్టి ఈ పూజ నదుల శుద్ధీకరణలపై కూడా దృష్టిసారించేలా చేస్తుంది. పండుగ సమయంలో ప్రసాదంగా సమర్పించే బెల్లం, చెరకు, కొబ్బరిరకాయలు, అరటిపళ్లు, పసుపు,అల్లం ఇత్యాది సామగ్రి ఆరోగ్యానికి కూడా మేలుచేస్తుందంటారు వైద్య నిపుణులు.
 
మరిన్ని వార్తలు