గృహ హింస గుప్పిట్లో బాల్యం

12 Sep, 2017 08:50 IST|Sakshi
గృహ హింస గుప్పిట్లో బాల్యం

పిల్లలను బాదేస్తున్న తల్లిదండ్రులు
తమ ఒత్తిళ్లు, ఆక్రోశాన్ని బాలలపైకి మళ్లింపు
వేదనతో రుగ్మతల పాలవుతున్న పసిమొగ్గలు
నిమ్హాన్స్‌ సర్వేలో చేదు నిజాలు


రెండువారాల కిందట బెంగళూరు జేపీ నగర ప్రాంతంలో ఉన్న ఒక బెంగాలీ మహిళ అపార్ట్‌మెంట్‌ నుంచి తన ఏడేళ్ల కూతురిని తోసేసి చంపేసింది. అందుకు ఆ తల్లి చెప్పిన కారణం... ఆ పాప ఏడేళ్లొచ్చినా సరిగ్గా మాట్లాడలేకపోతోందనే  విసుగుతోనే అలా చేసిందట. ఈ కేసును పరిశీలించిన మానసిక  శాస్త్రవేత్తలు... నిందితురాలి వైవాహిక జీవితం సరిగా లేకపోవడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనైందని, ఆ ఆక్రోశంతో తన బిడ్డనే   చంపుకుందని విశ్లేషించారు. ఇలా ఐటీ సిటీలో బాల్యం కూడా గృహహింసకు గురవుతోంది. ఇది నిజం.

సాక్షి, బెంగళూరు : నగర జీవితంలో ప్రతి క్షణం ఒత్తిళ్లే. ఇక ఇంట్లో మహిళలు కూడా ఇలాంటి ఒత్తిళ్లనే ఎదుర్కొంటుంటారు. భర్త, అత్తమామల నుంచి ఎదురయ్యే శారీరక, మానసిక హింస కారణంగా తీవ్ర ఆవేదనకు లోనవుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. ఇలాంటి వారు ఆ ఆక్రోశాన్నంతా ఇంట్లో ఉన్న పిల్లలపై చూపిస్తున్నారు. కంటికి రెప్పలా పసిపిల్లలను తల్లిదండ్రులు తమ కోపాలకు బలి చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఇంట్లో కూడా చిన్నారులకు రక్షణ లేకుండా పోతోందని బెంగళూరు నిమ్హాన్స్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

బాలల్లో పెరిగిన రుగ్మతలు
నగరంలోని ప్రతి పది మంది చిన్నారుల్లో ఇద్దరు వివిధ మానసిక సమస్యలతో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ (నిమ్హాన్స్‌)కు వస్తున్నారు. వీరికి కౌన్సిలింగ్‌ ఇచ్చిన సైక్రియాట్రిస్ట్‌లకు తమ తల్లిదండ్రుల ద్వారానే శారీరక, మానసిక హింసను ఎదుర్కొంటున్నారని తెలిసింది. పిల్లలు చదువులో రాణించలేకపోతున్నారనో, అల్లరి చేస్తున్నారనో, అందంగా లేరనో, ఆడపిల్ల అనో ఇంకా వివిధ కారణాలు చెబుతూ తమ పిల్లలపై హింసకు పాల్పడుతున్నారని నిమ్హాన్స్‌కు చెందిన సైక్రియాట్రిస్ట్‌లు చెబుతున్నారు.

తమ సమస్యలు తట్టుకోలేక...
= ఇక నిమ్హాన్స్‌ వైద్యుల వద్దకు వచ్చిన మరో కేసులో స్వయంగా తల్లే తన ఎనిమిదేళ్ల కూతుర్ని సిగరెట్లతో కాలుస్తుండడాన్ని గుర్తించారు. ఎందుకిలా చేస్తున్నావంటూ సైక్రియాట్రిస్ట్‌లు ఆమెను ప్రశ్నిస్తే ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.....‘మాకు తెల్లగా ఉన్న అబ్బాయి పుడతాడని అనుకున్నాం. అయితే అమ్మాయి పుట్టింది, అది కూడా నల్లగా ఉంది.’ అని చెప్పింది. విచారించిన వైద్యులు ఆమె వైవాహిక జీవితం సరిగా లేదని, భర్త, అత్తమామల నుండి ఎదుర్కొంటున్న హింస కారణంగానే ఆమె అలా తయారైందని తేల్చారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో తమ పిల్లలపైనే శారీరక, మానసిక హింసకు పాల్పడుతున్న ఉదంతాలు ప్రస్తుతం నగరంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

‘పనిష్మెంట్‌ పేరెంటింగ్‌’ పెరుగుతోంది
ఇటీవలి కాలంలో పనిష్మెంట్‌ పేరెంటింగ్‌ పెరిగిపోతోంది. ఆఫీసులో, ఇంట్లో తమకు ఎదురవుతున్న ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఇలా తమ ఒత్తిడి ఏదైనా సరే ఆ ఆక్రోశాన్నంతా పిల్లలపై చూపుతున్నారు. అంతేకాదు వారిని కొట్టడం తమ హక్కుగా భావిస్తున్నారు. పిల్లలను కర్ర లేదా బెల్ట్‌లతో ఎక్కువగా కొట్టడం, చీకటి గదుల్లో పెట్టి బంధించడం వంటి శిక్షలతో చిన్నారులు శారీరక, మానసిక హింసను ఎక్కువగా ఎదుర్కొనాల్సి వస్తోంది. ఇలాంటి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ను ఇవ్వాలి. లేదంటే ప్రవర్తన మరింత విపరీతంగా మారవచ్చు.  హింసను తట్టుకోలేక చిన్నారులు మానసిక రుగ్మతలకు లోనయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.    
– డాక్టర్‌ కె.జాన్‌ విజయ్‌ సాగర్, నిమ్హాన్స్‌ ప్రతినిధి

మరిన్ని వార్తలు