ఐఏఎస్ అధికారి ఇంటిలో నీలి చిత్రాల సీడీలు

6 Nov, 2015 08:47 IST|Sakshi
ఐఏఎస్ అధికారి ఇంటిలో నీలి చిత్రాల సీడీలు

బెంగళూరు : వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి, కర్ణాటక క్రీడా యువజన శాఖ ప్రధాన కార్యదర్శి కపిల్ మోహన్ ఇంటిలో చిన్నపిల్లల నీలిచిత్రాలు (చైల్డ్ పొనోగ్రఫీ) కలిగిన సీడీ, హార్డ్ డిస్క్ లభ్యమయ్యాయి. ఈ విషయమై బెంగళూరు యశ్వంతపుర పోలీస్ స్టేషన్‌లో గురువారం ఆయనపై ఐటీ యాక్ట్-67బీ ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదైంది. వివరాలు... అనేక అక్రమాలకు పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు కపిల్ మోహన్‌పై ఉన్నాయి.
 
ఆయన నివసిస్తున్న గోల్డన్ గేట్ అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్ (602) లో సీఐడీ, ఐటీ అధికారులు ఈ ఏడాది ఆగస్టు 5న సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. రూ.4.30 కోట్ల నగదు, వజ్రాభరణాలు వివిధ ఆస్తులకు సంబంధించిన దస్త్రాలతో పాటు 28 సీడీలు, ఒక హార్డ్ డిస్క్‌ను ఆ సమయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 
అనంతరం ఈ కేసును లోకాయుక్తకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో సీఐడీ సోదాల్లో బయట పడిన దస్త్రాలు, సీడీలు, హార్డ్ డిస్క్‌లను లోకాయుక్త అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా సీడీలను, హర్డ్ డిస్క్‌ను పరిశీలించగా 20 సీడీల్లో సాధారణ నీలిచిత్రాలు, ఒక సీడీలో చైల్డ్ ఫొనోగ్రఫీ ఉన్నట్లు లోకాయుక్త పోలీసులు గుర్తించారు.
 
దీంతో ఈ విషయమై బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్‌కు లోకాయుక్త సంస్థ ఏడీజీపీ ప్రేమ్‌కుమార్ మీన లేఖ రాసి ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని కోరారు. దీంతో కమిషనర్ మేఘరిక్ సూచనల మేరకు కపిల్ మోహన్‌పై ఐటీ యాక్ట్-67( బీ)ను అనుసరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
 

మరిన్ని వార్తలు