కళ్లలో కారం చల్లి రూ. 80 లక్షలు చోరీ

28 Jul, 2016 12:13 IST|Sakshi

మనీ ఎక్స్చేంజ్ ఏజెన్సీ యజమాని పరార్
 
చెన్నై: చెన్నై నుంచి పుదుచ్చేరీకి రహస్యంగా తరలిస్తున్న రూ.80 లక్షల హవాల సొమ్మును దొంగలెత్తుకెళ్లడం నగరంలో కలకలం రేపింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పుదుచ్చేరి వాంజినాథన్ వీధికి చెందిన చోళియన్ (40). ఇతను విదేశీ కరెన్సీకి భారత కరెన్సీని ఇచ్చే మనీ ఎక్చ్సేంజ్ ఏజన్సీని పుదుచ్చేరీలో నడుపుతున్నాడు.

ఇతని వద్ద అదే ప్రాంతానికి చెందిన షణ్ముగం (37) అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. పుదుచ్చేరీలో పెద్ద ఎత్తున సాగే కరెన్సీ మార్పిడి వ్యాపారంలో భాగంగా సదరు షణ్ముగం 15 రోజులకు ఒకసారి చెన్నైకి వచ్చి ఇక్కడి బ్రాడ్‌వేలోని ఒక ప్రముఖ మనీ ఎక్సేంజ్ ద్వారా హవాలా సొమ్ముగా మార్చుకుంటాడు.
 
 ఈ హవాలా సొమ్ముతో తిరిగి పుదుచ్చేరికి చేరుకుంటాడు. మనీ ఎక్సేంజ్‌కీ ఎలాంటి డాక్యుమెంటు అవసరం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తమ సంస్థకు వచ్చిన ఐరోపా దేశ యూరో కరెన్సీని భారత కరెన్సీగా మార్చేందుకు షణ్ముగం మంగళవారం చెన్నైకి వచ్చాడు. బ్రాడ్‌వేలోని మనీ ఎక్చ్సేంజ్‌కు వెళ్లి యూరోలను రూ.80 లక్షల భారత కరెన్సీగా మార్చుకుని సిటీ బస్సులో తిరువాన్మియూరు బస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
 
అక్కడి నుండి పుదుచ్చేరీకి వెళ్లేందుకు మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అక్కడి వాల్మీకి మునీశ్వర ఆలయం వద్ద బస్ కోసం వేచి ఉన్నాడు. ఆ సమయంలో మూడు బైక్‌లలో వచ్చిన ఆరుగురు షణ్ముగం ముఖంపై కారం పొడి చల్లి రూ.80 లక్షలను లాక్కున్నారు. వెంటనే వారి సమీపంలోకి వచ్చిన ఒక కారులో ఇద్దరు పారిపోయారు. మరో ఇద్దరు బైక్‌లో పరారయ్యారు.  తిరువాన్మీయూరు పోలీసులను షణ్ముగం ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
అలాగే పుదుచ్చేరీకి చెందిన ఒక ఎమ్మెల్యే అన్న కుమారుడికి కూడా రూ.80 లక్షల సొమ్ము వ్యవహారం తెలుసని, అతని ప్రోద్బలం ఉండవచ్చని షణ్ముగం పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. సొమ్ము చోరీకి గురికాగానే మనీ ఎక్చ్సేంజ్ ఏజెన్సీ యజమాని చోళియన్ పారిపోవడంతో పోలీసులు అతన్ని కూడా అనుమానిస్తున్నారు. మనీ ఎక్చ్సేంజ్ వ్యాపారం ద్వారా లెక్కల్లో చూపని రూ.80 లక్షల తరలింపు వెనుక మర్మం ఏమిటని పోలీసులు విచారిస్తున్నారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా