రక్షకులే భక్షకులైతే...

28 Apr, 2015 02:55 IST|Sakshi

 వివాదాల్లో పోలీస్ అధికారులు
 భార్యపై కిరాయిమూకలతో
 ఎస్‌ఐ హత్యాయత్నం
 వివాహిత మహిళపై ఇన్‌స్పెక్టర్
 హత్యాచారం
 ఇన్‌స్పెక్టర్‌కు బుద్ధి చెప్పిన ప్రజలు
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి : సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ, నేరాలను అరికట్టాల్సిన రక్షకులే భక్షకులైతే ప్రజలను రక్షించేది ఎవరు. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో చోటుచేసుకున్న ఘటనలు సమాజాన్ని ఈ రకంగా ఆలోచింపజేశాయి. పోలీస్ శాఖ పరువు తీశాయి. వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల వివరాల ప్రకారం.. చెన్నై నగరం టీపీ సత్రం పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ రామనాథ కన్నన్ (53)కు, ఎలిఫెంట్ గేట్ పోలీస్‌స్టేషన్‌లోని మహిళా ఎస్‌ఐకు వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఎస్‌ఐలు ఇద్దరూ తరచూ విహారయాత్రకు వెళ్లేవారు. ఈ విషయం ఎస్‌ఐ భార్య బొమ్మి చెవిన పడటంతో భర్తను హెచ్చరించింది. వినిపించుకోకపోగా మహిళా ఎస్‌ఐ ఇంటనే కాలం గడపడం, తన జీతాన్ని సైతం ఆమె చేతిలోనే పెట్టడంతో బొమ్మికి ఇల్లుగడవడం కష్టమైంది. భర్త అదుపులోకి రాకపోవడంతో ఈనెల 25వ తేదీన మహిళా ఎస్‌ఐ ఇంటికి వెళ్లి గొడవపడి తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
 
 ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడు ఎస్‌ఐకి వెళ్లబోసుకోవడంతో ఆయన అగ్రహం చెందాడు. ఆదివారం మధ్యాహ్నం సినిమాల్లో స్టంట్స్ పాత్రధారి శివకుమార్ (35), స్నేహితుడు కలీబదుల్లా (26) అనే ఇద్దరు యువకులు బొమ్మి ఇంటిలోకి చొరబడి కొట్టారు. ఆమె కేకలతో ఇరుగుపొరుగు వారు వచ్చి దాడులకు పాల్పడిన ఇద్దర్నీ పట్టుకుని పోలీస్‌స్టేషన్లో అప్పగించారు. బొమ్మిపై దాడికి పురమాయించింది ఎస్‌ఐ రామనాథ కన్నన్ అని కిరాయిరౌడీలు వాంగ్మూలం ఇచ్చారు. సదరు ఎస్‌ఐపై శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఇదే ఎస్‌ఐ ఎగ్మూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే సమయంలో బైక్‌లను దొంగలించి అమ్ముకునే కేసులో ముద్దాయిగా ఉండటం గమనార్హం.
 
 హత్యాచారయత్నం కేసులో ఇన్‌స్పెక్టర్..

 తిరునెల్వేలి జిల్లా రామనాథపురం పోలీస్ ఇన్‌స్పెక్టర్ మురుగేశన్‌కు తిరుచ్చిరాపల్లిలో పనిచేసే సమయంలో పరిమళ (35) అనే వివాహితతో స్నేహం ఏర్పడి క్రమేణా సాన్నిహిత్యం పెరిగింది. వీరిద్దరి వ్యవహారంతో విసిగిపోయిన ఇన్‌స్పెక్టర్ భార్య వెళ్లిపోయింది. లంచం కేసులో అరెస్టయి దాని నుంచి బైటపడేందుకు పరిమళ నగలను ఇన్‌స్పెక్టర్ వాడుకున్నారు. కొద్దికాలానికి వెళ్లిపోయిన భార్య తిరిగి వచ్చినా ఇన్‌స్పెక్టర్, పరిమళ మధ్య సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంది.
 
 ఈనెల 25వ తేదీన తిరుచ్చికి వచ్చిన మురుగేశన్ పూటుగా మద్యం తాగి తన ఇంటికి వచ్చి అత్యాచారయత్నం చేశాడని పరిమళ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పించుకుని ఆస్పత్రిలో చేరగా అక్కడికి కూడా వచ్చి తనను బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి హత్యాయత్నం చేయగా పారిపోయి వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మురుగేశన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తిరుచ్చి పోలీస్‌స్టేషన్ ముందు నిరాహారదీక్ష ప్రారంభించింది.
 
 ఇన్‌స్పెక్టర్‌కు బుద్ధి చెప్పిన ప్రజలు..

 మీంజూరు భజన కోవిల్ వీధికి చెందిన పళని (40) అనే హెడ్‌కానిస్టేబుల్ మాధవరం పోలీస్‌స్టేషన్‌లో సెక్యూరిటీ గార్డు విధులను నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులను ముగించుకుని తన ఇంటికి బైక్‌పై వెళుతుండగా మనలి న్యూటౌన్ వద్ద ఒక కంటైనర్ లారీ అతన్ని ఢీకొంది. తీవ్రగాయాలై సృ్పహ కోల్పోయే స్థితికి చేరుకున్నాడు. 108కు సమాచారం ఇచ్చి ప్రజలు ఎదురు చూస్తుండగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కన్నన్ ఆ వైపు జీపులో వెళుతుండగా ఆపారు. అంబులెన్స్‌లో తీసుకెళ్లండి అంటూ సలహా ఇచ్చి బయలుదేరాడు. ఆగ్రహానికి గురైన స్థానికులు ఆయన జీపును చుట్టుముట్టారు. ‘సాటి పోలీసు ప్రాణాలనే కాపాడలేని నీవు ప్రజలను ఎలా రక్షిస్తావు’ అంటూ నిలదీయడంతో గత్యంతరం లేక జీపును ఆస్పత్రి వైపు మళ్లించాడు. ప్రజలే పోలీసు అధికారిపై తిరగబడి బుద్ధి చెప్పడాన్ని అందరూ ప్రశంసించారు.
 
 నిందితునికి స్వేచ్ఛ..ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్

 నగరంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే పాత నేరస్తుడు స్వేచ్ఛగా సంచరిస్తున్నా పట్టించుకోని నేరానికి తంజావూరు జిల్లా ఇన్‌స్పెక్టర్ సస్పెండయ్యారు. వీసీకే నేత శిఖామణిపై సుకుమార్ ఆదివారం హత్యాయత్నం చేశాడు. సుకుమార్‌పై అప్పటికే 15 కేసులు, రాజకీయ నేతలపై దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు గాలిస్తున్నట్లు రికార్డుల్లో ఉంది. అయినా నగరంలో స్వేచ్ఛగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో తంజావూరు జిల్లా కుంభకోణం తిరుప్పన్‌తాళ్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ రవిచంద్రన్‌ను సోమవారం సస్పెండ్ చేశారు. ఇలా రాష్ర్టంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట పోలీసు అధికారులకు సంబంధించి కేసులు నమోదు అవుతుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రజలను రక్షించాల్సిన అధికారులు ఇలా వ్యవహరింపై మండి పడుతున్నారు. తద్వారా పోలీసు శాఖ పరువు పోతోందని పలువురు విమర్శిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు