సినిమా పేరుతో మోసం

25 Jul, 2016 10:35 IST|Sakshi
తిరువొత్తియూరు(చెన్నై): సినిమాల్లో అవకాశం కల్పిస్తానని చెప్పి విద్యార్థులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి 27 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. శివగంగై జిల్లా దేవకోటై కీళవాయిల్ గ్రామం కార్‌మేఘన్ కుమారుడు పాండియన్ (40) సినిమాల పేరుతో విద్యార్థులను లక్ష్యం చేసుకొని చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం ట్రిప్లికేన్ దంత వైద్యశాల దగ్గర నిలుచొని ఉన్న మెకానిక్ మణి (21), అతని స్నేహితుడు ఆది (23)లను సినిమాల్లో అవకాశం ఉందంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. విజయ్ సినిమాలో నటించేందుకు అవకాశం కల్పిస్తానని చెప్పి నమ్మబలికాడు. కొద్ది దూరం తీసుకెళ్లి పాండియన్ కత్తి చూపించి వారి వద్ద వున్న సెల్‌ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించారు.
 
దీంతో వీరద్దరూ కేకలు వేయడంతో స్థానికులు పాండియన్ చుట్టుముట్టి పట్టుకున్నారు. అతనిని ట్రిప్లికేన్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేయగా 21న తండయారుపేటలోని విద్యార్థులకు సినిమా ఆశ చూపి 15 సెల్‌ఫోన్లను, 16న వేలూరు జిల్లా రాణిపేట ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల వద్ద 16 సెల్‌ఫోన్లను చోరీ చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు అతని వద్ద నుంచి 27 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశారు.

 

మరిన్ని వార్తలు