నగరం చుట్టూ ఎనిమిది సిటీ క్లస్టర్లు

3 Sep, 2013 03:36 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరుపై ఒత్తిడి తగ్గించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించడానికి నగరం చుట్టూ ఎనిమిది సిటీ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వినయ్ కుమార్ సొరకె వెల్లడించారు. సోమవారం ఆయనిక్కడ తన శాఖ వంద రోజుల సాధనల జాబితాను విడుదల చేసిన సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు రూ.2,100 కోట్లు ఖర్చవుతుందని, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి ఆర్థిక సాయం తీసుకోదలిచామని తెలిపారు. ప్రతిపాదిత సిటీ క్లస్టర్లలో నెలమంగల, మాగడి, ఆనేకల్, బిడది, డాబస్‌పేట, హరోహళ్లి, దేవనహళ్లి, హొసకోటెలు ఉంటాయని వివరించారు.

బెంగళూరుపై వచ్చి పడుతున్న పెట్టుబడులను మరల్చడానికి ఈ ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా ఐదు కారిడార్లతో కూడిన బెంగళూరు సబర్బన్ రైలు వ్యవస్థ కోసం రూ.8,759 కోట్లతో చేపట్టదలచిన తొలి దశ ప్రాజెక్టు నివేదిక త్వరలో సిద్ధమవుతుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో నగరం నుంచి తుమకూరు, రామనగర, బంగారుపేటలకు రైల్వే సేవలు అందించే ప్రతిపాదనలున్నాయని తెలిపారు. దీనిని చేపట్టడానికి బెంగళూరు సబర్బన్ రైల్ కార్పొరేషన్‌ను త్వరలోనే స్థాపించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గిపోతాయన్నారు.
 
సీఎంసీల స్థాయి పెంపు

 తుమకూరు, శివమొగ్గ, బిజాపుర సిటీ మునిసిపల్ కౌన్సిళ్ల (సీఎంసీ) స్థాయిని పెంచడానికి కేబినెట్ నోట్‌ను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. జేఎన్ నర్మ్ కింద 61 ప్రాజెక్టులను చేపట్టడానికి రూ.5,265.22 కోట్లు వ్యయం కాగల ప్రతిపాదనలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపినట్లు తెలిపారు. ఇందులో రూ.168 కోట్లకు ఇదివరకే ఆమోదం లభించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 నీటి సరఫరా ప్రాజెక్టులను చేపట్టడానికి రూ.711.92 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. బెల్గాం, గుల్బర్గ, హుబ్లీ-ధార్వాడ నగరాలకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో నిరంతర నీటి సరఫరాకు రూ.1,760 కోట్లు వ్యయం కాగల ప్రాజెక్టును సిద్ధం చేసినట్లు వెల్లడించారు. దీనికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయాన్ని కోరినట్లు చెప్పారు.
 
వార్డు కమిటీలు

 రాష్ర్టంలోని అన్ని మహా నగర పాలికెల్లో వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ సభలను నిర్వహించే విధంగా వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. దీని వల్ల ఆయా వార్డులకు కేటాయించిన నిధులను సద్వినియోగం చేయడానికి, పనుల నాణ్యతను పరిశీలించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఇదివరకే మైసూరులో ప్రయోగాత్మకంగా ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. మున్ముందు ఇతర పాలికెలకు విస్తరిస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు