నిధులతోనే ‘స్వచ్ఛ’మైపోదు

1 Oct, 2016 03:33 IST|Sakshi
నిధులతోనే ‘స్వచ్ఛ’మైపోదు

‘స్వచ్ఛ భారత్’పై మోదీ

న్యూఢిల్లీ: బడ్జెట్ కేటాయింపులతోనే ‘స్వచ్ఛ భారత్’ సాకారమవ్వదని, అది ప్రజా ఉద్యమంగా మారినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రోడ్లపైనున్న చెత్త ఫొటోలు తీసి ‘స్వచ్ఛ భారత్’ విఫల క్యాంపెయిన్ అంటున్న వారినుద్దేశించి  మాట్లాడుతూ... కనీసం ఈ కార్యక్రమంవల్ల ప్రజల్లో పరిశుభ్రతపైఅవగాహన వచ్చిందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. రోడ్లపై చెత్త వేయడానికి తానూ వ్యతిరేకమేనన్నారు. స్వచ్ఛభారత్‌కు రెండేళ్లయిన సందర్భంగా శుక్రవారమిక్కడ జరిగిన సమావేశంలో ప్రధాని ప్రసంగించారు.

నాడు మహాత్మాగాంధీ ‘సత్యాగ్రహ’ స్ఫూర్తితో ‘స్వచ్ఛాగ్రహ’గా పలికిన మోదీ... పరిశుభ్రతను పరమాత్మతో పోల్చారు. మత సంబంధిత ప్రదేశాల్లోని వ్యర్థాలను కంపోస్టుగా మార్చాలని సూచించారు. చెత్తను రీసైక్లింగ్‌తో సంపద, ఉపాధి కల్పించే వనరుగా మలచవచ్చన్నారు. ఓ అంగన్‌వాడీ వర్కర్ తన పాత చీరను కర్చీఫ్‌లుగా చేసి చిన్నారులకు ఇచ్చారని, తద్వారా వారిలో పరిశుభ్రతపై అవగాహన పెంచారన్నారు. ‘ఈ సమావేశానికి వచ్చే క్రమంలో చాలామంది బస్సు సీట్లకు వేళ్లతో రంధ్రాలు చేసుంటారు. ప్రజాసంపదను సొంత ఆస్తిగా అనుకోవాలి’ అని  అన్నారు.

>
మరిన్ని వార్తలు