దుర్గామాత విగ్రహాల నిమజ్జనం యమునా నది పరిసరాలు అపరిశుభ్రం

5 Oct, 2014 22:28 IST|Sakshi

 న్యూఢిల్లీ: విరిగిపోయిన కుండలు... కుళ్లిపోయిన పూలు... చిరిగిపోయిన గుడ్డముక్కలు..తడిసిపోయిన రంగులు... ఇదీ యుమునా నది ఒడ్డున ఆది వారం కనిపించిన దృశ్యం. శరన్నవరాత్రులు ముగి సిననేపథ్యంలో శనివారం నగరంలోని పలు ప్రాం తాలకు చెందిన మండపాల యజమానులు దుర్గామాత ప్రతిమలను యుమునా నదిలో నిమజ్జనం చేసిన సంగతి విదితమే. ఇప్పటికే కాలుష్యపు కోరల్లో చిక్కుకుపోయిన యమునా నది ఒడిలోకి వందలాది దుర్గామాత విగ్రహాలు చేరిపోయాయి. క్లీన్ ఇండియా పేరిట ప్రధానమంత్రి నరేంద్రమోడీ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల రెండో తేదీన దేశవ్యాప్తంగా స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను ప్రారంభించిన సంగతి విదితమే. వచ్చే ఐదేళ్లలోగా భారత్‌నుపరిశుభ్రతకు మారుపేరుగా నిలపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మోడీ చేపట్టారు.
 
 ఇంతవరకూ బాగానే ఉంది కానీ శరన్నవరాత్రులు పూర్తయి దుర్గామాత విగ్రహాల నిమజ్జనం అనంతరం ఆదివారం యుమనా నది పరిసరాలకు వచ్చినవారికి బోలెడంత చెత్త కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రధాని విన్నపాన్ని నగరవాసులెవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ నది ఒడ్డున ఎంతకాలమైనా భూమిలో కలిసిపోయే గుణమేలేని చెక్కలు, ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ నీటి సీసాలు, ఖాళీ చిప్ ప్యాకెట్లు, బిస్కట్ ప్యాకెట్లతోపాటు విషలక్షణాలు కలిగిన అనేక వస్తువులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. సగం తిని వదిలేసిన ఆహార పదార్థాలకోసం కుక్కలు గాలిస్తూ కనిపిం చాయి. ఈ విషయమై కాళిందీకుంజ్ ఘాట్‌లో పడవ నడిపే 17 ఏళ్ల జమ్నాసింగ్ మాట్లాడుతూ ఇక్కడ మొత్తం ఆరు ప్రాంతాల్లో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు సంబంధిత అధికారులు అనుమతించారని అన్నారు. ఈ చెత్త కొద్దిరోజులపాటు ఇక్కడ ఇలాగే పడిఉంటుందన్నారు. సింగ్ స్నేహితుడు దేవేంద్ర మాట్లాడుతూ ఈ కథ ప్రతి ఏడాదీ సర్వసాధారణమేనని,
 
 నిమజ్జనానికి వచ్చిన భక్తులు ప్లాస్టిక్ తదిరత వ్యర్థపదార్థాలను ఇష్టమొచ్చినట్టుగా పడేస్తుంటారని అన్నాడు. అధికారిక గణాంకాల ప్రకారం కాళిందీకుంజ్ ఘాట్ వద్ద దాదాపు 200 దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. కాగా యుమునా నదిలోని జలాలు 70 శాతం మంది నగరవాసుల తాగునీటి అవసరాలను తీరుస్తోంది. కాగా యుమునా నది కాలుష్యానికి అసంఘటిత పూజా కమిటీలే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. తాము పర్యావరణ అనుకూల సామగ్రినే దుర్గామాత విగ్రహాల తయారీకి వినియోగిస్తామని  సామ్రాట్ బెనర్జీ అనే ఓ సంఘటిత పూజా కమిటీ సభ్యుడు ఆరోపించారు. అయితే అసంఘటిత పూజా కమిటీలు ఇష్టమొచ్చిన సామగ్రిని వినియోగిస్తున్నాయంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
 

మరిన్ని వార్తలు