-

డీఎంకేలో ప్రక్షాళన

30 May, 2014 00:46 IST|Sakshi
డీఎంకేలో ప్రక్షాళన

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి డీఎంకే నేతల కంటిపై కునుకు లేకుండా చేసింది. ప్రత్యర్థి అన్నాడీఎంకే జయకేతనం వారిని మరింత కృంగదీసింది. పార్టీని ప్రక్షాళన చేయడం ద్వారా కోల్పోయిన జవసత్వాలను కూడగట్టుకునే పనిలో పడింది. ఓటమి భారంతో అస్తమించిన ‘సూర్యుడి’ని మళ్లీ ఉదయింపజేసేందుకు సన్నద్ధం అవుతోంది.

- రాజీనామా లేదా తొలగింపు
- కొత్తగా 10 జిల్లా కమిటీలు
- జూన్ 2న ఉన్నతస్థాయి సమావేశం

 చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని అంశాల్లో ఎదురుదెబ్బలు తింటున్న డీఎంకేకు లోక్‌సభ ఎన్నికలు మరో చేదు అనుభవాన్ని మిగి ల్చారుు. 37 స్థానాల్లో ఒంటి చేత్తో విజయం సాధిం చిన సీఎం జయలలిత దూకుడుకు కళ్లెం వేయలేని డీఎంకే డీలా పడింది. స్వయంగా పోటీ చేసిన 35, మిత్రపక్షాలకిచ్చిన ఐదు ఏ ఒక్కింటినీ డీఎంకే దక్కించుకోలేక పోయింది. పైగా అనేక చోట్ల డిపాజిట్టు కోల్పోయి అవమానాల పాలైంది.

ఈలం తమిళుల సమస్య, అవినీతి, అక్రమాల ఆరోపణలపై సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రులు ఏ రాజా, దయానిధి మారన్‌లను పోటీకి దింపడం, కరుణ పెద్ద కుమారుడు అళగిరి బహిష్కరణతో పార్టీలో ఏర్పడిన అంతర్గత కలహాలు తమ కొంపముంచాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీ ప్రతిష్ట అడుగంటిపోయిన స్థితిలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే మీమాంసలో పడిపోయారు.

ప్రక్షాళన, పదవులతో పూర్వ వైభవం
పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేస్తూ సంస్కరించడం ద్వారా పూర్వవైభవం సాధించాలని డీఎంకే అగ్రనాయకత్వం ఆశిస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కోశాధికారి, కరుణ తనయుడు స్టాలిన్ రాజీనామా చేయడం, పార్టీ నిరాకరించడం, ఆయన ఉపసంహరిచడం వంటి హైడ్రామా సాగింది. ఇందుకు కొనసాగింపుగా జూన్ 2న పార్టీ ఉన్నతస్థాయి సమావేశానికి ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ పరాజయంపై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చలు జరపనుంది.

అధిక సంఖ్యలో అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన 10 జిల్లాలను పార్టీపరంగా రెండుగా విభజించి రెండు కమిటీలను వేయాలని భావిస్తోంది. తద్వారా ఎక్కువమందికి పార్టీ పదవులను కట్టబెట్టితే  వారు ఉత్తేజితులు కాగలరని అదిష్టానం ఆశపడుతోంది. పార్టీ అధ్యక్ష, కార్యదర్శ పదవుల్లో సుదీర్ఘకాలంగా ఉన్నవారిని తొలగించి కొత్తవారికి ఇవ్వాలని సంకల్పించింది. సుమారు 20 ఏళ్లుగా అధ్యక్ష, కార్యదర్శులున్నవారు 50 శాతం మంది ఉన్నారు. వీరందరికీ పదవీ వియోగం తప్పేట్లు లేదు. జిల్లా స్థాయిలో మార్పులు, కూర్పులు చేసేందుకు వీలుగా నేతల నుంచి స్వచ్ఛందంగా రాజీనామాలు కోరాలని, కాదన్నవారిని బలవంతంగా తప్పించాలని భావిస్తోంది.

మరిన్ని వార్తలు