సీఎం దృష్టికి ‘108’ సమస్యలు

5 Aug, 2013 03:23 IST|Sakshi

 సాక్షి, బెంగళూరు :  ‘ఆరోగ్యకవచ-108’ సిబ్బంది సమస్యలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి ప్రయత్నిస్తానని పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావు అన్నారు. డిమాండ్ల సాధనలో భాగంగా కొన్ని రోజులుగా బెంగళూరులోని ఫ్రీడం పార్కులో రిలేనిరాహార దీక్షలు చేస్తున్న 108 సిబ్బంది నాయకులను ఆయన ఆదివారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... సిబ్బంది వేతనాల పెంపు, పనివేళల తగ్గింపు తదితర విషయాలు న్యాయసమ్మతంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వోద్యోగులగా గుర్తింపుపై, మిగిలిన సమస్యలను సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళుతానన్నారు.
 
 నాలుగేళ్లుగా సేవలందించిన 108 సిబ్బందిలో ఒకేసారి 2,500 మందిని తొలగించడం సాధ్యం కాదన్నారు. ఏ సందర్భంలో జీవీకే సంస్థ ప్రతినిధులు ఈ విధంగా పేర్కొన్నారో తెలియదన్నారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని 108 సిబ్బంది సమస్యలకు ప్రభుత్వం పరిష్కారమార్గాన్ని కనుగొంటుందని అన్నారు. కాగా, ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నాయకుడు శ్రీధర్ మాట్లాడుతూ డిమాండ్లు పరిష్కారమయ్యేంతవరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు