ప్యాకేజీకి చట్టబద్ధత ఇవ్వకుంటే పోరాటం చేస్తా..

7 Feb, 2017 02:10 IST|Sakshi
ప్యాకేజీకి చట్టబద్ధత ఇవ్వకుంటే పోరాటం చేస్తా..

జల్లికట్టు పశువుల పండుగ.. అది హోదా ఉద్యమానికి స్ఫూర్తా: సీఎం చంద్రబాబు
సుప్రీంకోర్టు వద్దన్నా కోడి పందేల విషయంలో చూసీచూడనట్లు వెళ్లాలని పోలీసులకు చెప్పా..

సాక్షి, గుంటూరు: ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం చట్టబద్ధత ఇచ్చే వరకూ వదిలి పెట్టేది లేదని.. ఈ విషయంలో తాను పోరాటం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గుంటూరు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాతగుంటూరు, నగరంపాలెం మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌లను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఫైనాన్స్‌ కమిషన్‌లో వీలు కాలేదని, హోదాలో ఇచ్చే అన్ని ప్రయోజనాలు ప్రత్యేక ప్యాకేజీలో ఇస్తామని చెప్పడం వల్లే ఒప్పుకున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలకు రాయితీలు రావని ఆయన తెలిపారు. విశాఖ పట్నంలో జల్లికట్టు స్ఫూర్తితో ప్రత్యేక హోదా ఉద్యమానికి పిలుపునిచ్చారని, జల్లికట్టు పశువుల పండుగని వ్యాఖ్యానించారు. రిపబ్లిక్‌ డే రోజు దేశభక్తి చాటాల్సింది పోయి నిరసనకు పిలుపునివ్వడం అభ్యంతరకరమన్నారు. గోదావరి జిల్లాల్లో కోళ్ల పందేలకు సుప్రీం కోర్టు అనుమతించకపో యినా తాను పోలీసులకు చూసీచూడనట్లు వెళ్లాలని చెప్పానని సీఎం పేర్కొన్నారు.

విద్యార్థుల్లారా..మీ కోసమే ఈ పోలీస్‌స్టేషన్లు
సభకు హాజరైన విద్యార్థులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. మీ కోసమే మోడల్‌ పోలీస్‌స్టేషన్‌లు ఏర్పాటు చేశామని సీఎం అనడంతో అంతా విస్తుపోయారు. ఆ తర్వాత  సీఎం మీ భవిష్యత్తు కోసమని సర్ది చెప్పారు.

మరిన్ని వార్తలు