ఎదురుచూపులు

26 Oct, 2016 01:52 IST|Sakshi

సీఎం జయ డిశ్చార్జ్‌కు సిద్ధం     
27వ తేదీలోగా ప్రకటన

33 రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత త్వరలో డిశ్చార్జ్ కానున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇందుకు సన్నాహాలు సాగుతున్నట్లు సమాచారం.
సాక్షి ప్రతినిధి,చెన్నై: జ్వరం, డీహైడ్రేషన్ బారినపడి ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చేరార ంటూ గత నెల 23వ తేదీన అపోలో హెల్త్‌బులెటిన్ విడుదల చేసింది. స్వల్ప అనారోగ్యమేనని, రెండు మూడు రోజుల్లో ఆమె ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకుంటారని అందరూ భావించారు. అయితే ఇప్పట్లో డిశ్చార్జ్ కారని, సుదీర్ఘకాలం ఆసుపత్రిలో ఉంటూ చికిత్సలు పొందాల్సి ఉంటుందని బులెటిన్ స్పష్టం చేయడంతో అన్నాడీఎంకే శ్రేణులు నిరాశకు లోనయ్యారు. స్వల్ప అనారోగ్యం అంటూనే లండన్ నుంచి అంతర్జాతీయ వైద్యనిపుణుడు డాక్టర్ రిచర్డ్‌ను, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులను, సింగపూర్ నుంచి మహిళా ఫిజియోథెరపిస్టులను వరుసగా రప్పించడం అన్నాడీఎంకే శ్రేణులను
 
ఆందోళన కలిగించింది. సీఎం ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనలు, ప్రత్యేక పూజలు, హోమాలు ప్రారంభమైనాయి. ఈ ప్రార్థనలు ఫలించాయా అన్నట్లుగా సీఎం క్రమేణా కోలుకున్నారు. శ్వాసకోశ ఇబ్బందులను దాటుకుని స్వేచ్ఛగా శ్వాస పీల్చడంతోపాటు, తానే స్వయంగా ఆహారం తీసుకుంటున్నట్లు అపోలో వైద్యులు చెబుతున్నారు. ఆమె ఆరోగ్యం దాదాపు సాధారణ స్థితికి వచ్చినట్లు తేలడంతో డిశ్చార్జ్ చేయాలని వైద్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
 
అన్నాడీఎంకే ముఖ్యనేతలంతా అపోలో ఆసుపత్రి వద్దనే గడుపుతున్నందున వారంతా దీపావళి పండుగకు దూరం అవుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎం జయలలిత సైతం దీపావళి పండుగలోగా ఇంటికి చేరుకోవాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో సీఎం డిశ్చార్జ్ అవుతారని తెలుస్తుండగా ఇందుకు సంబంధించి ఈనెల 27వ తేదీలోగా ఒక ప్రకటన విడుదల కాగలదని అంచనా వేస్తున్నారు. అంతేగాక అమ్మ డిశ్చార్జ్ కోసం అటు వైద్యులు, ఇటు పార్టీ శ్రేణులు సన్నాహాలు సాగిస్తున్నట్లు సమాచారం.
 
అధికారులకు హైకోర్టు ఆదేశం:
సీఎం జయలలిత చికిత్స పొందడాన్ని అడ్డుపెట్టుకుని డీఎంకే నేతల ఫేస్‌బుక్, ట్విట్టర్లను హాక్ చేయరాదని మద్రాసు హైకోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. డీఎంకే నేతల హక్కులను కాలరాచే విధంగా పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తోందని, అమ్మ వదంతులు అంటూ అరెస్టులకు పాల్పడుతోందని పొల్లాచ్చికి చెందిన నవనీత కృష్ణన్ అనే డీఎంకే నేత మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ముఖ్యమంత్రి జయలలిత పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరించబోమని డీఎంకే ఇచ్చిన హామీని రికార్డు చేసుకుంటున్నామని న్యాయమూర్తి రాజేంద్రన్ తెలిపారు.
 
 కొన్ని నిబంధనలకు లోబడి ఫేస్‌బుక్, ట్విట్టర్లలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ప్రజలకు ఉందని ఆయన అన్నారు. డీఎంకే నేతల ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను హాక్ చేయడం సరికాదని అన్నారు. సీఎం గురించి డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవచ్చు కాబట్టి, ఈ కేసు విచారణను ఇంతటితో ముగిస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు. అమ్మ కోలుకోవాలని ప్రార్థిస్తూ అనేక ఆలయాల్లో ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమాలు జరిగాయి.

మరిన్ని వార్తలు