ఆర్తుల్ని ఆదుకోవాలి

21 Jun, 2018 10:10 IST|Sakshi
విపత్తు నిర్వహణ సమావేశంలో మంత్రి మండలి సభ్యులతో ఉన్నతాధికారులు  

భువనేశ్వర్‌ : రానున్నది విపత్తు కాలం. విపత్తు చెంతలో తలదాచుకుంటున్న వర్గాలను ఆదుకునేందుకు అనుబంధ యంత్రాంగాలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పిలుపునిచ్చారు. ఆయన అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విపత్తు నిర్వహణ సమావేశంలో మంత్రిమండలి సభ్యులు, ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల కార్యదర్శులు ఇతరేతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆకస్మిక విపత్తు తాండవించే ఊహాతీత పరిస్థితుల్లో గర్భిణులు, దివ్యాంగులు, వయోవృద్ధులు, వితంతువులు, పిల్లలు వగైరా వర్గాలపట్ల ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ వర్గాలను తక్షణమే అక్కున చేర్చుకుని విపత్తు నుంచి కడతేర్చాలని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సూచించారు. 

వాతావరణ కదలికను గమనించాలి 
ఈ ఏడాది వాతావరణంలో అవాంఛనీయ మార్పులు సంభవిస్తున్నాయి. రుతుపవనాలు నిర్ధారిత సమయం కంటే ముందుగా రాష్ట్రాన్ని తాకినప్పటికీ వానలు కనుమరుగ య్యాయి. వేసవి మరోసారి పునరావృతమై వాతావరణం వేధిస్తోంది. విపరీతమైన వేడి, ఉక్క పోత వంటి సహించ లేని వాతావరణం అల్లాడిస్తోంది. వానలు గాలిలో తేలిపోతున్నాయి. ఇటువంటి వాతావరణ మార్పుల పట్ల వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించడం అనివార్యం.

స్థానిక ఒడిశా యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ అనుసంధానంతో వ్యవసాయ శైలిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ఏటా రాష్ట్రానికి ఏదో రీతిలో విపత్తు పీడించడం నిరవధికంగా జరుగుతోంది. గత ఏడాది రాష్ట్రంలో కరువు తాండవించడంతో పంటకు చీడ పట్టి వేధించిన పరిస్థితుల్ని ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖకు వేలెత్తి చూపారు. విపత్తు నిర్వహణ కంటే నివారణ ప్రధానంగా అనుబంధ వర్గాలు గుర్తించాలి. వాతావరణ స్థితిగతులకు అనుగుణంగా పొంచి ఉండే విపత్కర పరిస్థితుల్ని వ్యవసాయ పరిశోధకులు, నిపుణులతో సాంకేతిక, పాలన వర్గాలు అనుసంధానపరుచుకుని ముందుకు సాగితే విపత్తు నివారణ సాధ్యమవుతుందన్నారు.

ప్రజల సంరక్షణతో పంటల సంరక్షణ కూడా అంతే అవసరంగా అధికారులు గుర్తించి విపత్తు నిర్వహణ కోసం నడుం బిగించి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. వానలు వచ్చినట్లు వచ్చి కనుమరుగయ్యాయి. వేసవి కంటే  అధికంగా వేధిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు వేసవి సెలవుల్ని వరుసగా రెండు సార్లు పొడిగించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పంచా యతీ రాజ్‌ విభాగం  ఆధ్వర్యంలో జలాశయాలు, నీటి వనరుల సమీకరణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మేరకు అదనపు నిధుల్ని ప్రభుత్వం కేటాయిస్తుందని బిజూ జనతా దళ్‌ నాయకుడు అమర ప్రసాద్‌ శత్పతి తెలిపారు. 

కాగితాలకే పరిమితం కాకూడదు: నర్సింగ మిశ్రా
విపత్తు నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అభినందనీయం. ఈ నేపథ్యంలో తీర్మానించిన భావి కార్యాచరణ వాస్తవంగా అమలుచేసి విపత్తు నుంచి రక్షణ కల్పించాలి. సమావేశం తీర్మానాలు కలం–కాగిత పత్రాలకు పరిమితమైతే ప్రయోజనం ప్రాణాంతకంగా మారుతుందని ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నాయకుడు నర్సింగ మిశ్రా తెలిపారు. 

మరిన్ని వార్తలు