ఇంతులకు ఎంతగానో..

21 Apr, 2018 08:11 IST|Sakshi
అసెంబ్లీలో ముఖ్యమంత్రి

మహిళల భద్రతే..ప్రధాన ధ్యేయం

ట్రాఫికింగ్‌ నివారణలో మేటి

తగ్గుముఖం పట్టిన మావోయిజం

అసెంబ్లీలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ 

భువనేశ్వర్‌ : రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడం ప్రధాన ధ్యేయమని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ శాసన సభలో ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశ పెట్టిన వాయిదా తీర్మానంపై ఆయన సమగ్ర వివరాల్ని సభలో ప్రవేశ పెట్టారు. రాష్ట్ర హోం శాఖ బాధ్యతలు ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నందున వాయిదా తీర్మానంపట్ల ఆయన సమగ్ర సమాచారాన్ని సభలో తెలియజేశారు. బడ్జెట్‌ మలివిడత సమావేశాలు తరచూ వాయిదా పడుతున్నాయి.

మహా నది జలాల పంపిణీ వివాదం, జగన్నాథుని ఉపవాసం వగైరా శీర్షికలతో సభా కార్యక్రమాలు వాయిదాపడిన విషయం విదితమే. జగన్నాథుని సేవల్లో అవాంఛనీయ జాప్యం వివాదాన్ని  పురస్కరించుకుని రెండు రోజులుగా సభా కార్యక్రమాలు స్తంభించాయి. స్పీకర్‌ ప్రదీప్‌ కుమార్‌ ఆమత్‌ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం నిర్వహించడంతో ఈ విచారకర పరిస్థితులకు తెరపడింది. శుక్రవారం సభా కార్యక్రమాలు తొలినుంచి సజావుగా సాగాయి.  

మహిళలపట్ల నేరాలు, శాంతి భద్రతల శీర్షికతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర శాసన సభా పక్ష నాయకుడు నర్సింగ మిశ్రా సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్పీకర్‌ ఆమోదంతో ఈ తీర్మానంపై సభలో సుదీర్ఘంగా చర్చ సాగింది. రాష్ట్రంలో పలు చోట్ల మహిళలకు వ్యతిరేకంగా నమోదైన కేసులపట్ల తమ విభాగం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని సీఎం చెప్పారు. ఇటువంటి 943 కేసుల్ని రెడ్‌ ఫ్లాగ్‌ కేసులుగా గుర్తించి అత్యధిక ప్రాధాన్యం కల్పించామన్నారు. మహిళలపై వేధింపుల కేసులపట్ల విభాగం ఘాటుగా స్పందిస్తోందన్నారు. 

రాష్ట్రంలో 6 మహిళా పోలీస్‌ స్టేషన్లు
మహిళల అక్రమ రవాణాను నివా రించడంలో జాతీయ స్థాయిలో రా ష్ట్రం  అగ్ర స్థానంలో నిలిచిందన్నా రు. రాష్ట్రవ్యాప్తంగా 537 పోలీసు స్టేషన్లలో మహిళా సహాయ డెస్కుల్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి సభకు వివరించారు. మహిళల భద్రతా వ్యవస్థను పటిష్టపరిచేందు కు 6 మహిళా పోలీసు స్టేషన్లు   పనిచేస్తున్నాయి. మహిళలు, శిశువులు, బలహీన వర్గాలకు భద్రత కల్పి ంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం కల్పి స్తుంది. కేసుల నమోదు, ఉన్నత స్థాయి దర్యాప్తు, సత్వర సముచిత న్యాయం కల్పించడంలో పోలీసు వ్యవస్థ చురుగ్గా  పనిచేయడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

కేసుల విచారణలో జాప్యం లేదు
మహిళలు, బాలికలపట్ల అమానుష దాడులు వగైరా నేరాలకు పాల్పడిన నిందితులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టడంలో విభాగం ఏమాత్రం సంకోచించడం లేదన్నారు. ఉన్నత స్థాయి దర్యాప్తు అధికారులు, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించి కేసుల విచారణలో జాప్యాన్ని నివారిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యల నివారణపట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మేధా శక్తిని సమన్వయపరచి నిరవధికంగా కృషి చేస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. పార్టీ, రాజకీయాలకు అతీతంగా సభ్యులంతా రాష్ట్ర ప్రజల రక్షణ, భద్రత వ్యవహారాల కార్యాచరణలో స్వచ్ఛందంగా పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 

తగ్గిన మావోయిస్టుల హింస
రాష్ట్రంలో మావోయిజం తగ్గుముఖం పట్టిందని హోమ్‌ శాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌  శాసనసభలో ప్రకటించారు. రాష్ట్రంలోని  6 మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో మావోయిజాన్ని పూర్తిగా నివారించినట్లు సభకు వివరించారు. ఈ జాబితాలో కెంజొహర్, మయూర్‌భంజ్, గజపతి, జాజ్‌పూర్, ఢెంకనాల్‌ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ జిల్లాలు మావోయిస్టుల కబ్జా నుంచి విముక్తి పొందినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయాన్ని సభలో వివరించారు.

సాధారణ ప్రజానీకంపట్ల మావోయిస్టుల హింసలు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు వివరించారు. షాపింగ్‌ మాల్స్, సినిమా హాళ్లు, భారీ స్థాయి దుకాణాలు ఇతరేతర జన సందోహిత ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయడం నేర నియంత్రణకు ఎంతగానో దోహదపడుతోందంటూ  ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తప్పి పోయిన 8,118 మంది శిశువుల్ని పలు ప్రాంతాల్లో గుర్తించి ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ముష్కాన్, ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమాలు విజయవంతమైనట్లు ముఖ్యమంత్రి సంతృత్తి వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు