ఎత్తుగడేనా ?

18 Aug, 2017 04:02 IST|Sakshi
ఎత్తుగడేనా ?

జయ మరణ విచారణ కమిషన్‌ ఏర్పాటుపై సర్వత్రా సందేహాలు
శశికళ అండ్‌ కో అణచివేత కోసమేనని వ్యాఖ్యలు
పోయెస్‌ గార్డెన్‌ ఇల్లు ఇక ప్రభుత్వపరం
సీఎం ఎడపాడి సంచలన ప్రకటన
విపక్షాల్లో మిశ్రమ స్పందన


ఇటీవలి కాలంలో రాజకీయ కలకలాలు సృష్టించడంలో దేశానికే రాజధానిగా మారిన తమిళనాడులో తాజాగా మరో సంచలనం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై న్యాయ విచారణకు ఆదేశించడం ద్వారా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి రాష్ట్ర రాజకీయాలను మరో మలుపు తిప్పే ప్రయత్నం చేశారు. మద్రాసు హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో విచారణ కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ఆయన  ప్రకటించారు. జయ నివసించిన చెన్నై పోయెస్‌ గార్డెన్‌లోని ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జయలలిత స్మారక మందిరంగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే వర్గపోరును తట్టుకునేందుకు సీఎం పళని స్వామి కొత్త ఎత్తుగడ వేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జయ మరణం ఇక మిస్టరీగానే మిగిలిపోనుందని అందరూ భావిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా సీఎం ఎడపాడి తెరపైకి తెచ్చారు. గురువారం ఉదయం తన మంత్రివర్గ సహచరులతో సీఎం సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

సీఎం సీరియస్‌గా నిర్వహిస్తున్న సమావేశంలోని అంతరార్థం ఏమిటనే ఉత్కంఠ మొదలైనా ఎలాంటి సమాచారం బయటకు పొక్కలేదు. సాయంత్రం సీఎం ఎడపాడే స్వయంగా మీడియా ముందుకు వచ్చారు. అమ్మ మరణంలో అందరికీ అనేక సందేహాలున్నాయి, వాటిని నివృత్తి చేయడం కోసం విచారణ కమిషన్‌ వేస్తున్నట్లు ప్రకటించారు. రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్‌ ఏర్పాటుచేసి విచారణ జరపనున్నట్లు తెలిపారు. అలాగే పోయెస్‌ గార్డెన్‌లోని జయలలిత ఇంటిని అమ్మ స్మారక మందిరంగా మార్చి ప్రజల సందర్శనకు ఉంచుతామని తెలియజేయడం చర్చకు దారితీసింది.

ఇంత కాలం తర్వాత..
అంతా నేనేగా వ్యవహరించిన జయలలిత అకస్మాత్తుగా కన్ను మూయడం ఆ పార్టీని కకావికలం చేసింది. అమ్మ లేని అనాథగా మారిన అన్నాడీఎంకేని చిన్నమ్మ (శశికళ) చేతుల్లోకి తీసుకున్నారు. జయ మరణించి నెల తిరక్క ముందే పార్టీ ప్రధాన కార్యదర్శిగా మారారు. మరో నెల గడిచేలోగా సీఎం సీటుపై కన్నేసి అడ్డుగా ఉన్న పన్నీర్‌సెల్వం చేత బలవంతంగా రాజీనామా చేయించారు. అప్పటివరకు చిన్నమ్మ చాటు చిన్నబిడ్డలా  ప్రశాతంగా ఉండిన పన్నీర్‌ సెల్వం హఠాత్తుగా ఆమెపై తిరుగుబాటు చేశారు. జయలలిత మరణం అనుమానాస్పదం, ఇన్‌చార్జ్‌ సీఎంగా ఉండిన తనను సైతం జయను చూసేందుకు శశికళ అనుమతించలేదని విమర్శించారు.

అమ్మ మరణం వెనుక చిన్నమ్మ హస్తం ఉందని ఆరోపించారు. దీంతో దేశం యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జయ చికిత్స పొందిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం, చికిత్స చేసిన లండన్‌ డాక్టర్‌ సైతం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మెరీనా బీచ్‌లోని సమాధి నుంచి జయ మృతదేహాన్ని వెలికితీసి ఎందుకు రీపోస్టుమార్టం నిర్వహించకూడదని మద్రాసు హైకోర్టుకు చెందిన ఒక న్యాయమూర్తి కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేస్తూ మద్రాసు హైకోర్టులో కొందరు పిటిషన్‌ వేశారు. పార్టీలో విలీనం కావాలంటే జయ మరణంపై విచారణకు ఆదేశించాలని సుమారు మూడునెలల క్రితం మాజీ సీఎం పన్నీర్‌సెల్వం రాష్ట్ర ప్రభుత్వానికి షరతు కూడా విధించారు. జయ మరణంపై ఇంత రాద్దాంతం జరుగుతున్నా శశికళ ఆశీస్సులతో సీఎంగా మారిన ఎడపాడి ఇంతకాలం నోరుమెదపలేదు.

నేతల మిశ్రమ స్పందన
జయలలిత మరణంపై విచారణ కమిషన్‌ నియామకంపై నేతల నుంచి మిశ్రమ స్పందన లభించింది. రిటైర్డు జడ్జితో విచారణ కేవలం కంటి తుడుపు చర్య అని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. సీఎం ఎడపాడి, మంత్రులు తమ పదవికి రాజీనామా చేసి సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్‌ చేశారు. విచారణ కమిషన్, స్మారక మందిరం నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై తెలిపారు.

ఇంతకాలం మౌనం వహించి ఈరోజు విచారణకు ఆదేశించడం శశికళ కుటుంబాన్ని తొక్కిపెట్టేందుకేనని డీఎంకే రాజ్యసభ సభ్యులు టీకేఎస్‌ ఇళంగోవన్‌ వ్యాఖ్యానించారు.  తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు తిరునావుక్కరసర్, అన్నాడీఎంకే నేత, పార్లమెంటు డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై స్వాగతించారు. మాజీ సీఎం పన్నీరువర్గానికి చెందిన మాజీ మంత్రి కేపీ మునుస్వామి విమర్శించారు. విలీనంపై తాము పెట్టిన షరతుల్లో నేరవేరినట్లుగా తాము అంగీకరించబోమని, సీబీఐ విచారణ డిమాండ్‌కే తాము కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. జయకు 74 రోజులపాటూ చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు గురువారం ఒక  ప్రకటన విడుదల చేసింది.

ఎడపాడి ఎత్తుగడ
అన్నాడీఎంకేలోని ప్రధాన వైరివర్గాలైన ఎడపాడి, పన్నీర్‌సెల్వం విలీనం కావాలని బీజేపీ అధిష్టానం, ప్రధాని మోదీ నుంచి ఒత్తిడి పెరిగింది. అంతేగాక శశికళ కుటుంబంలేని అన్నాడీఎంకేని ఆశిస్తున్నట్లు కూడా బీజేపీ షరతు విధించింది. జయ అనుమానాస్పద మృతిపై అందరి అనుమానాలు శశికళపైనే ఉన్నాయి. విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయడం ద్వారా శశికళను, ఆమె నియమించిన టీటీవీ దినకరన్‌ను పూర్తిగా కట్టడి చేయవచ్చనే ఆలోచనతోనే సీఎం ఎడపాడి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు భావిస్తున్నారు. అంతేగాక విలీనంపై పన్నీర్‌సెల్వం విధించిన ప్రధాన రెండు షరతులు నెరవేర్చినట్లు అవుతుంది. తద్వారా విలీనానికి మార్గం సుగమం అవుతుందని సీఎం ఎడపాడి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వాన్ని కూల్చివేస్తానంటూ దినకరన్‌ చేస్తున్న ప్రకటనలతో కేంద్రం నుంచి ఆదరణ పొందడం కూడా విచారణ కమిషన్‌లోని ఎత్తుగడగా వ్యాఖ్యానిస్తున్నారు.

దీప నిరాకరణ
జయలలిత ఇంటిపై తమకు వారసత్వపు హక్కులు ఉన్నాయని ఆమె మేనకోడలు దీప అన్నారు. గురువారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ, పోయెస్‌ గార్డెన్‌ ఇల్లు, అమ్మకం, కొనుగోలు హక్కు ఎవరికీ లేదని, ఆ ఇంటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోమని ఆమె అన్నారు. విచారణ కమిషన్‌ వేయడం వెనుక శశికళ కుటుంబ కుట్ర దాగి ఉందని ఆమె ఆరోపించారు. జయ కన్నుమూసిన నాటి నుంచి తాను విచారణకు డిమాండ్‌ చేస్తున్నా, ఇన్నాళ్లూ మిన్నకుండి నేడు ప్రకటన చేయడం తమ పదవులను కాపాడుకునే కపట నాటకమని ఆమె విమర్శించారు.

మరిన్ని వార్తలు