గజరాజుల పిక్నిక్

20 Dec, 2013 02:25 IST|Sakshi

 సాక్షి, చెన్నై:
 రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు గజరాజులు అంటే మక్కువ. ముఖ్య ఆలయ సందర్శనకు వెళ్లిన క్రమంలో గున్న ఏనుగును విరాళంగా సమర్పించడం ఆమెకు అలవాటు. ముదుమలై శరణాలయూనికి వెళ్తే చాలు అక్కడి గున్న ఏనుగుల్ని ఆప్యాయంగా తాకడం, ఆశీర్వచనాలు తీసుకోవడం ఆమెకు అల వాటు. అందుకే కాబోలు  వన్యప్రాణులకూ  మానసికోల్లాసం తప్పనిసరి అని ఆమె గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ఏనుగులకు పునరావాస శిబిరాన్ని నిర్వహించాలని 2003లో నిర్ణయించింది. పెద్ద సంఖ్యలో ఆలయ ఏనుగులను, వ్యక్తిగతంగా ఇతర  వ్యక్తుల పర్యవేక్షణలో ఉన్న ఏనుగులను, జంతు ప్రదర్శన శాలల్లో ఉండే ఏనుగుల్ని ఒక చోటికి తరలించి వాటికి కావాల్సిన ఆహారాన్ని అందించడం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, శారీరక ఉత్తేజాన్ని కలిగించే విధంగా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
 
 2003లో 30 రోజుల పాటు ఈ శిబిరం ద్వారా 55 ఏనుగులకు ప్రత్యేక సేవల్ని అందించారు. పిక్నిక్ స్పాట్‌కు వచ్చినంత ఆనందంగా స్నేహితుల్లా, బంధువుల్లా  అవి కలసి మెలసి మెలగడంతో ప్రతి ఏటా ఏనుగులకు పునరుత్తేజం కల్పించే విధంగా ఈశిబిరం ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఏనుగుల సంఖ్య పెరుగుతూ రావడంతో 48 రోజులకు శిబిరం నిర్వహణకు చర్యలు చేపట్టారు. అయితే, 2006లో అన్నాడీఎంకే సర్కారు పతనం కావడం, డీఎంకే అధికార పగ్గాలు చేపట్టడంతో  ఆలయాలకే గజరాజులు పరిమితం కావాల్సి వచ్చింది. మూడోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక మళ్లీ పునరావస శిబిరాల్ని ఏర్పాటు చేస్తూ గజరాజులపై ఉన్న మక్కువను ముఖ్యమంత్రి జయలలిత చాటుకుంటున్నారు.
 
 గజనాదం: పునరావాస కేంద్రానికి వచ్చే ఏనుగులు తిరిగి వెళ్లే సమయంలో అడుగు వేయకుండా మారాం చేస్తాయి. ఇందుకు కారణం అక్కడ వాటికి కల్పించే సౌకర్యాలు, అందించే సేవలే. ఈ ఏడాది గురువారం నుంచి పునరావాస శిబిరం ఏర్పాటుకు సీఎం జయలలిత ఆదేశించారు. రూ.కోటి 53 లక్షలు కేటాయిం చారు. అయితే, ఇక్కడి సౌకర్యాలు కేవలం ఆలయాలకు చెందిన ఏనుగులకే కాకుండా, దర్గాల్లో ఉండే ఏనుగులకు కల్పించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీంతో సీఎం జయ అన్ని ఏనుగుల్ని పునరావాస కేంద్రానికి తరలించేలా ఆదేశిం చారు. దీంతో వంద ఏనుగులు ఆ కేంద్రానికి చేరుకున్నాయి.
 ఆరంభం: గజరాజుల్లో ఆనందాన్ని కల్పించే విధంగా పునరావాస కేంద్రం గురువారం ఆరంభం అయింది. కోయంబత్తూరు జిల్లా, మేట్టు పాళయం తాలుకా, తేక్కం పట్టి గ్రామం, వనభద్ర కాళియమ్మన్ ఆలయం సమీపంలోని భవానీ నదీ తీరంలో పునరావాస శిబిరం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఆహ్లాదకర వాతావరణంతో ఉండే ఈ ప్రదేశంలో నాలుగు ఎకరాల స్థలం గజరాజుల కోసం అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఈ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు చెందూర్‌పాండియన్, ఎంఎస్‌ఎం ఆనందన్ ప్రారంభించారు. సింగారంగా ముస్తాబైన గజరాజులు వరుసగా బారులు తీరాయి. ఒక్కో గజరాజుకు పండ్లు, ఫలాలను మంత్రులు అందజేసి శిబిరాన్ని ఆరంభించారు.
 
 సంరక్షణ: ఈ శిబిరంలో తొలి రోజు ఏనుగుల అలసటను తీర్చే విధంగా విశ్రాంతిని కల్పించారు. అనంతరం  ఏనుగులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏనుగులను సంరక్షించే మావటిలకు సైతం శిబిరంలో ప్రత్యేక సదుపాయాలను కల్పించారు. చెరకు, అరటి, యాపిల్, కొబ్బరి మట్టలతోపాటు రాగి, బయో బూస్ట్ లాంటి బలమైన ఆహారాన్ని ఏనుగులకు అందిస్తున్నారు. ఈ శిబిరంలో ఏనుగులు మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపే విధంగా ప్రత్యేక  ఏర్పాట్లు చేశారు.
 

మరిన్ని వార్తలు