మనసున్న మారాజు

3 Apr, 2018 09:49 IST|Sakshi
రాక్కమ్మాల్‌తో కలెక్టర్‌ అన్భళగన్‌

ఆదర్శ కలెక్టర్‌ అన్భళగన్‌

వృద్ధురాలి ఇంటి వద్దకే పింఛన్‌

ఆమెతో కలిసి భోజనం

మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు.. మనసున్న వాడు కష్టాల్లో ఉన్న వారికి దగ్గరగా ఉండాలని అనుకుంటాడు. రెండో కోవకు చెందిన వారే కరూర్‌ జిల్లా కలెక్టర్‌ అన్భళగన్‌. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న జిల్లాల కలెక్టర్లు ప్రజలతో సన్నిహితంగా మెలిగేందుకు అడుగులు వేస్తున్నారు. నీతి నిజాయితీతో, విధి నిర్వహణలో నిక్కచ్చితనంతో, సేవా ధృక్పథంతో ముందుకు సాగే సీనియర్‌ కలెక్టర్లు ఎందరో ఉన్నా, యువ కలెక్టర్లు సైతం తమకు ఆదర్శంగా ఉన్న వారి అడుగుజాడల్లో నడిచేందుకు ఇష్టపడుతున్నారు. నిత్యం జిల్లా వ్యవహారాల్లో బిజీగా ఉన్నా, ఏదో ఒక సందర్భంలో కొందరు కలెక్టర్లు తామూ సామాన్యులమేనని చాటుకుంటూ వస్తున్నారు. ఆ కోవలో పలువురు ఉన్నా, తాజాగా కరూర్‌ కలెక్టర్‌ అన్భళగన్‌ అందరికీ ఆదర్శవంతంగా నిలిచే రీతిలో సోమవారం ఓ వృద్ధురాలిని వెతుక్కుంటూ వెళ్లి మరీ పింఛను అందించారు. తన ఇంటివద్ద నుంచి భోజనం తయారుచేయించుకుని వెళ్లి ఆ అవ్వతో కలసి నేలమీద కూర్చుని భుజించడం విశేషం.

సాక్షి, చెన్నై : కరూర్‌ జిల్లా కలెక్టర్‌ అన్భళగన్‌ అందరికీ ఆదర్శవంతంగా నిలిచారు. ఎవరూ లేని ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వృద్ధురాలి విన్నపాన్ని తక్షణం పరిగణించారు. ఆమె ఇంటి వద్దకే వెళ్లి మరీ పింఛను మంజూరుకు  ఉత్తర్వులను అందజేశారు. ఆమెతో కలిసి గుడిసెలో నేల మీద కూర్చుని భోజనం చేశారు.

గుడిసెలో భోజనం
రాక్కమ్మాల్‌కు వృద్ధాప్య పింఛన్‌ అందించడమే కాదు, ఆమెకు మంచి భోజనం సైతం తన చేతులతో వడ్డించాలని కలెక్టర్‌ అన్భళగన్‌ భావించారు. సోమవారం తన ఇంటి నుంచి క్యారియర్‌ సిద్ధం చేసి పట్టుకు వెళ్లారు. చిన్నమ్మ నాయకన్‌ పట్టిలోని గుడిసెలో జానెడు పొట్టను నింపుకునేందుకు ఏదో వంట తయారీలో ఉన్న ఆమెను పరామర్శించారు. తాను జిల్లా కలెక్టర్‌ అని పరిచయం చేసుకున్నారు. ఆమె పెట్టుకున్న అర్జీ గురించి గుర్తుచేశారు. వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేసినట్టు, ఇక నెలసరి ఇంటి వద్దకే ఆమెకు పింఛను వచ్చి చేరే రీతిలో జారీచేసిన ఉత్తర్వులను చూపించారు. దీంతో రాక్కమ్మాల్‌ ఆనందానికి అవధులు లేవు. ఆనంద భాష్పాలతో కలెక్టర్‌కు ఆమె నమస్కరించారు. అంతే కాదు, ఆమెకు మంచి భోజనాన్ని వడ్డించేందుకు కలెక్టర్‌ సిద్ధం అయ్యారు.

అయితే, తనతో పాటు భోజనం చేయాలని రాక్కమ్మాల్‌ చేసుకున్న విజ్ఞప్తిని కలెక్టర్‌ అంగీకరించారు. ఆమెతో కలిసి మధ్యాహ్న భోజనం ఆరగించారు. ఆమెతో ముచ్చటిస్తూ,  ఏదేని సమస్య వస్తే, తన దృష్టికి తీసుకు రావాలని సూచించి సెలవు తీసుకున్నారు. నిన్నటివరకు రాక్కమ్మాల్‌ ఉందా..? లేదా..? అని కూడా ఆ గుడిసె వైపు తొంగి చూడని వాళ్లు సైతం ఆమె ఇంటికి కలెక్టర్‌ వచ్చి వెళ్లిన సమాచారంతో ఆ వృద్ధురాల్ని తమ గ్రామంలో ఓ వీఐపీ అన్నట్టుగా చూడడం మొదలెట్టడం గమనార్హం.

వేడుకోలు
కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌లో ప్రజల నుంచి ఫిర్యాదుల్ని స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సోమవారం పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి. వాటన్నింటికీ కిందిస్థాయి అధికారులు పరిశీలించి, అవసరం అనుకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతారు. మరికొన్ని చోట్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఫిర్యాదులు, వినుతులు పడి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల తన కార్యాలయానికి వచ్చి ఓ వృద్ధురాలు పెట్టుకున్న వేడుకలు కరూర్‌ జిల్లా కలెక్టర్‌ అన్భళగన్‌ హృదయాన్ని కదిలించింది.

కరూర్‌ చిన్నమ్మ నాయకన్‌ పట్టికి చెందిన రాక్కమ్మాల్‌ (80) వినతి ఆమె గుడిసె వైపుగా కలెక్టర్‌ను అడుగులు వేయించింది. తనకు ఎవరూ లేదని, ఊరి చివర్లో ఏదో ఓ పూరి గుడిసెలో ఉన్నట్టు, ఇంతవరకు తనకు వృద్ధాప్య పింఛను రాలేదని, తమరైనా స్పందించండి అని ఆమె చేసుకున్న మనవితో కలెక్టర్‌ సోమవారం అన్ని పనుల్ని పక్కన పెట్టి ఆమెను స్వయంగా కలిసేందుకు పయనం అయ్యారు.

మరిన్ని వార్తలు