కల్యాణ వైభోగమే!

21 Nov, 2017 07:05 IST|Sakshi
దివ్యాంగుల జంట

గీతాభవన్‌లో దివ్యాంగుల పెళ్లిసందడి

దంపతులకు డిప్యూటీ సీఎం,

మంత్రుల ఆశీస్సులు

జీవితంలో వివాహం మధుర ఘట్టం. అటువంటి వివాహ బంధపు దివ్యానుభూతిని దివ్యాంగులకు కల్పిస్తూ చెన్నై, గీతాభవన్‌ ట్రస్ట్‌ నిరుపమాన సేవలందిస్తోంది. ఏటా కొంతమంది దివ్యాంగులను, ఆర్థికంగా వెనుకబడిన వారిని ఎంపిక చేసి సామూహిక వివాహాలు జరిపిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. గత ఏడేళ్లలో 349  వివాహాలను జరిపించింది.

టీ.నగర్‌: గీతాభవన్‌ హాల్లో సోమవారం సామూహిక వివాహాలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం, సామాజిక సంక్షేమ శాఖ మంత్రి వి.సరోజ, రాష్ట్ర తమిళ భాషాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రి కె.పాండ్యరాజన్, దివ్యాంగుల సంక్షేమశాఖ, రాష్ట్ర కమిషనర్‌ వి.అరుణ్‌రాయ్‌ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి నూతన దంపతులకు ఆశీస్సులందించారు. ఇందులో మాజీ రాష్ట్రపతి మనవరాలు పద్మా వెంకటరామన్, లతా పాండ్యరాజన్, సింహచంద్రన్‌ పాల్గొన్నారు. ఇందులో ఓ.పన్నీర్‌ సెల్వంను అశోక్‌కుమార్‌ గోయెల్‌ శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం, మంత్రి వి.సరోజ వధూవరులను ఉద్ధేశించి ప్రసంగించారు.

ఏడేళ్లలో 349 వివాహాలు: మేనేజింగ్‌ ట్రస్టీ అశోక్‌కుమార్‌ గోయల్‌ తన స్వాగతోపన్యాసంలో ఎనిమిదేళ్ల క్రితం ఓ స్వచ్ఛంద సంస్థ పేద ప్రజలకు వివాహాలు జరిపించాల్సిందిగా కోరిందని, దీంతో 2010లో 34 వివాహాలు జరిపించామన్నారు. అందులో ఐదుగురు వధూవరులు దివ్యాంగులని అన్నారు. అప్పట్లో దివ్యాంగుల ముఖాల్లో సంతోషాన్ని చూసిన తాము దివ్యానుభూతికి గురయ్యామన్నారు. అనంతరం తాము ఇతర నిర్వాహకులతో చర్చించి ఏటా ఈ తరహా వివాహాలు జరిపేందుకు నిర్ణయించామన్నారు. ఇందుకు తమిళనాడు దివ్యాంగుల సంక్షేమ శాఖ పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. గత ఏడేళ్లలో 349 వివాహాలు జరిపించామని, ప్రస్తుతం 61జంటలకు వివాహాలు జరుపుతున్నట్టు తెలిపారు. మంత్రుల సమక్షంలో వేదపండితులు అశ్వనీశాస్త్రి మంత్రోచ్ఛరణల మధ్య హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహంతో జంటలు ఏకమయ్యాయి. నూతన దంపతులు గీతాభవన్‌ ట్రస్ట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

వివాహ జంటలతో డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం
వివాహ సామగ్రి ఉచితం: వివాహం చేసుకోదలచిన జంటలకు బంగారు మంగళసూత్రం, వెండి కాలిమెట్టెలు, ఫ్యాన్సీ జ్యువెలరీ, ముహూర్త వస్త్రాలు, పూజ, వంట పాత్రలు, గృహోపకరణాలు, రెండు నెలలపాటు కిరాణా వస్తువులు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ముందుగా గాయత్రీ శంకరన్‌ ప్రార్థనా గీతాన్ని శ్రావ్యంగా ఆలపించారు. 

మరిన్ని వార్తలు