తగ్గుతున్న అల్లర్లు

14 Dec, 2013 23:19 IST|Sakshi

ముంబై: రాష్ట్రంలో మతకల్లోలాలు, ఉగ్రవాదదాడులు గతంలో చాలాసార్లు సంభవించినా, వాటి సంఖ్య మెల్లగా తగ్గుముఖం పడుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ఇలాంటి అల్లర్లు 50 శాతం తగ్గాయని తెలిపాయి. హింసాత్మక ఘటనల నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకోవడం వల్లే సత్ఫలితాలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అల్లర్ల బాధితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం సానుకూల మార్పులకు కారణమవుతోంది. దేశవ్యాప్తంగా జరిగిన మతఘర్షణలపై బీజేపీ ఎంపీ గోపీనాథ్ ముండే, శివసేన సభ్యుడు ఆనంద్ పరాంజపే పార్లమెంటులో ఇటీవల అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఆర్పీఎన్ సింగ్ సవివర సమాధానాలు చెప్పారు.

కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలో 2010లో 117 హింసాత్మక ఘటనలు సంభవించగా, 16 మంది మరణించారు. అయితే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కేవలం 64 ఘటనలు నమోదుకాగా 11 మంది మృతి చెందారు. మనదేశంలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా మతఘర్షణలు జరిగాయి. ఈ ఏడాది అక్కడ 500 ఘటనలు జరగగా, 95 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.
 ఎలా నియంత్రించారంటే..
 మహారాష్ట్రలో గత 15-20 ఏళ్లకాలంలో సంభవించిన మతఘర్షణలు, హింసాత్మక ఘటనలను లోతుగా విశ్లేషించిన అధికారులు, అలాంటివి పునరావృతం కాకుండా నిరోధించడానికి పటిష్ట చర్యలు మొదలుపెట్టారు. మతపరంగా సున్నితపరమైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిందిగా కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ఆదేశించారు. మతసారస్య సాధనకు మొహల్లా కమిటీలను నియమించారు. ధుళే జిల్లాలో 2008లో జరిగిన మతఘర్షణలపై మహారాష్ట్ర సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ... అక్కడ హింసకు దారితీసిన పరిస్థితుల గురించి సమాచారం సేకరించడానికి ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించామని తెలిపారు. ‘చిన్న వివాదం తదనంతరం ఆ జిల్లాలో హింస మొదలయిందని మాకు తెలిసింది.

విధుల్లో నిర్లక్ష్యం వహించి తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమైన కొందరు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేశాం. ధుళే అల్లర్ల నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం. మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లోని అన్ని వర్గాల నాయకులతో ప్రతినెలా సమావేశాలు నిర్వహించి సుహృద్భావ వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన వివరించారు. తరచూ మొహల్లా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ అశాంతితగ్గుతుందని పోలీసులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలోని సంఘవ్యతిరేక శక్తులపై గట్టి నిఘా పెట్టడం ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తపడుతున్నారు. అంతేకాదు మతఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో శాంతిసాధనకు ముఖ్యమంత్రి, హోంమంత్రి నేతృత్వంలో సమావేశాలు నిర్వహించడం సత్ఫలితాలను ఇచ్చిందని రాష్ట్ర హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘పోలీసుల నిర్లక్ష్యాన్ని మేం ఎంతమాత్రమూ సహించడం లేదు.

ఘర్షణల నిరోధంలో విఫలమైన వారిని వెంటనే వెనక్కి పిలిపించి చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆయన వివరించారు. నిఘా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, అత్యవసర సమయాల్లో బలగాలను రాష్ట్రానికి పంపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతగానో సాయపడిందని ఆయన వెల్లడించారు. ఉగ్రదాడులు, మతఘర్షణలు, నక్సల్స్ దాడుల వల్ల నష్టపోయిన వారికి కూడా కేంద్రం ఆర్థికసాయం అందజేస్తోంది. అల్లర్ల కారణంగా అనాథలుగా మారిన చిన్నారులకు చదువు చెప్పిండానికి కేంద్రం జాతీయ మతసామరస్య సంస్థ కూడా సహకరిస్తోంది.

మరిన్ని వార్తలు