కండిషన్ అప్లై

18 Jan, 2014 06:14 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ అధిష్టానం కేపీసీసీకి పలు విధి విధానాలను సూచించింది. గత శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయిన వారు, లోక్‌సభ ఎన్నికల్లో 50 వేల ఓట్లకు పైగా తేడాతో ఓటమి చవి చూసిన వారిని ఎంపిక చేయవద్దని ఆదేశించింది. వీరి కంటే కొత్త ముఖాలను ఎంపిక చేయాలని సలహా ఇచ్చింది.

 నేర నేపథ్యం, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అభ్యర్థిత్వాలను పరిశీలించనే వద్దని సూచించింది. రాష్ట్రంలో మొత్తం 28 నియోజక వర్గాలుండగా కనీసం నాలుగైదు స్థానాల్లో యువకులకు అవకాశం కల్పించాలని కోరింది. ఇటీవలే పార్టీలో చేరిన విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్, కేఏఎస్ అధికారుల పేర్లను పరిశీలించ వద్దని సూచించింది. పార్టీకి కనీసం మూడు, నాలుగేళ్లు సేవ చేసిన వారిని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది.

ఏఐసీసీ సమావేశానికి ఢిల్లీకి వెళ్లిన కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా పార్టీ సీనియర్లకు అధిష్టానం ఈ సూచనలను జారీ చేసింది. కాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఈ మధ్య కాలంలో పార్టీలో చేరిన విశ్రాంత అధికారులకు అధిష్టానం ఆదేశాలు నిరాశను మిగిల్చాయి.

మరిన్ని వార్తలు