వయసు కాదు.. ఎత్తు ప్రామాణికం

18 Jul, 2016 01:54 IST|Sakshi
వయసు కాదు.. ఎత్తు ప్రామాణికం

పిల్లల ఎత్తు ఆధారంగా టికెట్ తీసుకునేలా మెట్రోలో నిబంధనలు
మూడు అడుగుల ఎత్తున్న చిన్నారులకు ఫుల్ టికెట్ తప్పనిసరి

 
బెంగళూరు: సాధారణంగా ఆరేళ్లకంటే తక్కు వయసున్న చిన్నారులకు బస్సులో లేదా ట్రైన్‌లో టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత 6 నుంచి 12 ఏళ్ల వరకు వయసున్న పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే సరిపోతుంది. అయితే వీటన్నింటిని పక్కకు పెట్టిన బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎంఆర్‌సీఎల్) ఓ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. మెట్రోలో ప్రయాణించే పిల్లల వయసును ప్రామాణికంగా తీసుకోకుండా వారి ఎత్తును బట్టి టికెట్‌ను కొనుగోలు చేసేలా నిబంధనలనున అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం మెట్రోలో ప్రయాణించే చిన్నారుల వయసు ఎంత అని కాకుండా వారి ఎత్తును బట్టి టికెట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. మూడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న చిన్నారులకు ఫుల్ టికెట్ తప్పక తీసుకోవాల్సిందేననే నిబంధనలను బీఎంఆర్‌సీఎల్ అమల్లోకి తీసుకొచ్చింది.
 
వయస్సు కావాలనే తక్కువగా చెబుతున్నారు....
బయప్పనహళ్లి నుంచి మైసూరు రోడ్డు వరకు ఇటీవల మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గంలో అండర్‌గ్రౌండ్‌లో సైతం రైలు ప్రయాణిస్తుంది. అంతేకాక ఈ మార్గంలో ఎంజీ రోడ్, కబ్బన్‌పార్క్, విధానసౌధ ప్రాంతాలు సైతం ఉండడంతో వారాంతాల్లో ఈ మార్గంలో తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ప్రయాణించేందుకు వచ్చే నగరవాసుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. అయితే ఈ మార్గంలో ప్రయాణించే చాలా మంది తమ పిల్లల వయస్సును కావాలనే తక్కువగా చెబుతున్నారు. తమ పిల్లలకు ఇంకా ఆరేళ్లు నిండలేదని చెబుతూ వారికి టికెట్ తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు గాను ఈ సరికొత్త విధానాన్ని బీఎంఆర్‌సీఎల్ అమల్లోకి తీసుకొచ్చింది. మూడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న చిన్నారులకు తప్పనిసరిగా ఫుల్ టికెట్ కొనాల్సిందేనన్న నియమాన్ని బీఎంఆర్‌సీఎల్ అమల్లోకి తీసుకొచ్చింది. కాగా, బీఎంఆర్‌సీఎల్ నిర్ణయంపై చాలా మంది తల్లిదండ్రులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బస్సులు, రైళ్లలో లేని నియమాన్ని మెట్రో రైలులో ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కనీసం హాఫ్ టికెట్ కూడా కాకుండా ఫుల్ టికెట్ ఎలా వసూలు చేస్తారనేది వారి ప్రశ్న.
 
ఢిల్లీ, ముంబై మెట్రోల్లోనూ ఇదే విధానం....
ఇక ఢిల్లీ, ముంబై మెట్రోల్లో సైతం చిన్నారుల టికెట్ కొనుగోలుకు సంబంధించి ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారని బీఎంఆర్‌సీఎల్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోని బీఎంఆర్‌సీఎల్ సైతం వయసును కాకుండా ఎత్తును ప్రామాణికంగా చేసుకొని టికెట్ కొనుగోలు చేసే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఈ విధానం వల్ల మెట్రోలో ప్రయాణించే చిన్నారుల వయసుకు సంబంధించిన  ధ్రువీకరణ కోసం ఇబ్బంది పడాల్సిన పని తప్పిందని మెట్రో స్టేషన్లలో పనిచేసే సిబ్బంది చెబుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు