బస్సు ఇబ్బందులపై కండక్టర్‌దే బాధ్యత!

22 Aug, 2013 00:14 IST|Sakshi

సాక్షి, ముంబై: వర్షాకాలంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై విధి నిర్వహణలో ఉన్న కండక్టరే స్వయంగా డిపోలో ఫిర్యాదు చేయాలని బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రయాణికులకు బస్సులో ఎదురయ్యే లీకేజీ, మూసుకోని, తెరుచుకోని కిటికీలు తదితర ఇబ్బందుల నుంచి త్వరలో విముక్తి లభించనుంది. వర్షాకాలం వచ్చిందంటే అనేక బస్సుల్లో టాప్ నుంచి లీకేజీ సమస్యలు ఎదురవుతాయి. గత్యంతరం లేక ప్రయాణికులు తడుస్తూ అలాగే ప్రయాణించాల్సి వస్తోంది. కిటికీల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంటుంది. కిటికీలు బిగుసుకుపోవడంతో అవి సరిగా పనిచేయవు. వాటిని మూయాలన్నా, తెరవాలన్నా పెద్ద ప్రహసనమే. ఇలాంటి పరిస్థితులు దాదాపు అన్ని బస్సుల్లోనూ దర్శనమిస్తున్నాయి. బస్సు డిపోలోకి రాగానే వీటిపై సంబంధిత సిబ్బందికి ఫిర్యాదు చేయాలని వర్షాకాలం ప్రారంభంలోనే  కండక్టర్లందరికీ బెస్ట్ పరిపాలన విభాగం ఆదేశించింది. కాని కండక్టర్లు దాన్ని పట్టించుకోవడం లేదు. డ్యూటీ పూర్తికాగానే కండక్టరు, డ్రైవర్ బస్సును డిపోలో నిలిపి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీన్ని సీరియస్‌గా పరిగణించిన బెస్ట్ అధికారులు ఇక నుంచి ఇలాంటి ఫిర్యాదులు తప్పకుండా చేయాలని ఉత్తర్వులు జారీచేశారు.
 
  లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందుకు కండక్టర్‌కు ఒక మార్కర్ కూడా ఇచ్చారు. లీకేజీ జరుగుతున్న చోట గుండ్రంగా మార్కింగ్ చేయాలని సూచించింది. పనిచేయని కిటికీలను గుర్తించి అక్కడ కూడా ఒక గుర్తు పెట్టాలని సూచించారు. బస్సు డిపోలోకి రాగానే సంబంధిత సిబ్బందికి ఫిర్యాదుచేస్తే వారు వెంటనే స్పందించి మరమ్మతులు చేస్తారు. అయితే బస్సుల తయారీలో ఎలాంటి లోపం లేదని బెస్ట్ అధికారి ఒకరు చెప్పారు. కాగా బస్సులు బెస్ట్ అధీనంలోకి వచ్చిన తర్వాత డిపోల్లో ప్లాజ్మా టీవీలు, సీసీ కెమెరాలు, స్పీకర్లు బిగించే పనులు జరుగుతాయి. అందుకు అవసరమైన వైరింగ్ పనులకు డ్రిల్లింగ్ చేయాల్సి వస్తుంది. దీంతో టాప్ లేదా బస్సు బాడీకి కొంతమేర హాని జరుగుతుంది.
 
 దీంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే వర్క్ షాపులో బస్సు బాడీ తయారుచేసే సమయంలోనే వీటిని అమర్చేలా చర్యలు తీసుకుంటే ఈ ఇబ్బందులు ఉండవని మరో అధికారి అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు