అంతా గందరగోళం

18 Jul, 2018 09:04 IST|Sakshi

‘అమ్మ’ వైద్యం నివేదికలో తేటతెల్లం

ఆర్ముగస్వామి కమిషన్‌ అసంతృప్తి

ముమ్మరంగా విచారణ

దివంగత సీఎం, అమ్మ జయలలితకు అపోలో ఆస్పత్రిలో అందించిన వైద్య చికిత్సలకు సంబంధించిన నివేదిక అంతా గందరగోళంగా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్‌ ఈ గందరగోళాన్ని గుర్తించింది. వైద్య రికార్డులను పర్యవేక్షిస్తున్న ఆస్పత్రి ప్రతినిధి గోవిందరాజన్‌ వద్ద మంగళవారం విచారణ నిర్వహించారు.

సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణం మిస్టరీని నిగ్చు తేల్చేందుకు రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్‌ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ విచారణ పరిధిలోకి అమ్మ జయలలిత, ఆమె నెచ్చెలి శశికళతో సన్నిహితంగా ఉన్న వాళ్లే కాదు, అనేక మంది అధికారులు, అపోలో ఆస్పత్రి వర్గాల్ని తీసుకొచ్చారు. వీరందరి వద్ద విచారణ సాగుతోంది. అలాగే, శశికళ తరఫున న్యాయవాది రాజచెందూర్‌ పాండియన్‌ విచారణకు హాజరవుతున్న వాళ్లను క్రాస్‌ ఎగ్జామిన్‌ సైతం చేస్తున్నారు. ఈ విచారణ సమయంలో అనేక అంశాలు, అనేకానేక కొత్త వివరాలు వెలుగులోకి వస్తుండడం చర్చకు దారితీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అపోలో ఆస్పత్రి సమర్పించిన నివేదిక అంతా గందరగోళంగా ఉన్నట్టు కమిషన్‌ గుర్తించడం మరో హాట్‌ టాపిక్‌గా మారింది.

హాట్‌ టాపిక్‌గా గందరగోళం :2016 సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి డిసెంబర్‌ ఐదో తేదీ వరకు 75 రోజుల పాటు అమ్మ జయలలితకు అపోలోలో చికిత్స సాగింది. ఈ కాలంలో ఆమెకు అందించిన వైద్య చికిత్సలు, పర్యవేక్షించిన డాక్టర్లు, ఇలా అన్ని రకాల వివరాలతో కూడిన నివేదికను ఆసుపత్రి వర్గాలు కమిషన్‌ ముందు ఎప్పుడో ఉంచాయి. వీటన్నింటి మీద పరిశీలన ప్రస్తుతం సాగుతున్నట్టుంది. అపోలో ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది వద్ద సాగిన విచారణతో పాటు, వారు అందించిన వివరాల మేరకు ఆ నివేదిక అంతా గందరగోళం అన్నట్టు తేలింది. ఈ విషయాన్ని ఆర్ముగస్వామి కమిషన్‌ గుర్తించింది. అసలు అమ్మ వైద్య చికిత్స వివరాలను సక్రమంగా నమోదు చేయనట్టు తేల్చి ఉన్నట్టు సమాచారం. అందుకే కాబోలు నివేదిక అంతా గందరగోళం అన్నట్టు మారడంతో వాటిని పర్యవేక్షిస్తున్న ఆసుపత్రి ప్రతినిధి గోవిందరాజన్‌ను కమిషన్‌ విచారణ పరిధిలోకి తీసుకొచ్చారు.

ఆయన్ను మంగళవారం కమిషన్‌ విచారించగా, అనేక ప్రశ్నలకు సమాధానాల కరువుతో న్యాయమూర్తి అసంతృప్తిని వ్యక్తం చేశారు. రోజూవారీగా జయలలితకు అందించిన వైద్యం, ఆమెకు ఇచ్చిన మందులు, అందించిన ఆహారం, వైద్య పరంగా ఇచ్చిన సలహాలు సూచనలు, ఇతర పరిశోధనలుఇలా అనేక వివరాలను గుర్తు చేస్తూ కమిషన్‌ ప్రశ్నల్ని సంధించింది. అనేక ప్రశ్నలకు ఆసుపత్రి ప్రతినిధి మౌనం వహించడంతో నివేదిక గందరగోళం అన్న నిర్ధారణకు కమిషన్‌ వచ్చినట్టు తెలిసింది. అంతే కాదు, ఏదో మొక్కుబడిగా అత్యవసరంగా ఈ నివేదికను తమ ముందు ఉంచినట్టుగా కమిషన్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ దృష్ట్యా, తదుపరి విచారణ ఎలా సాగనుందో ఉత్కంఠ బయలు దేరింది. ప్రధానంగా జయలలితకు వైద్యం చేసిన డాక్టర్లు ఇచ్చిన సమాచారాలు కూడా ఆ నివేదికలో సక్రమంగా లేని దృష్ట్యా, అపోలో వర్గాల్ని మళ్లీ విచారణకు పిలిపించడమా లేదా సమగ్ర నివేదికకు ఆదేశించడమా అన్న దిశగా కమిషన్‌ చైర్మన్‌ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు