హస్తానికి తెలిసొచ్చిన ప్రతిపక్షాల సత్తా

23 Mar, 2014 22:33 IST|Sakshi
హస్తానికి తెలిసొచ్చిన ప్రతిపక్షాల సత్తా

సాక్షి, న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ మరణానంతరం  భారీ మెజారిటీతో  గద్దెనెక్కిన ప్రభుత్వం కుంభ కోణాల్లో, రకరకాల ఆరోపణల్లో కూరుకుపోయి ప్రజల ఆశలను వమ్ము చేసింది. గాంధీ కుటుంబానికి అంతవరకు విశ్వసనీయుడుగా ఉంటూ వచ్చిన విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ ప్రధానమంత్రి  రాజీవ్‌గాంధీకి ప్రధాన శత్రువుగా మారారు.
 
 వి.పి. సింగ్ కేంద్ర బిందువుగా ఏర్పాటైన నేషనల్ ఫ్రంట్, బీజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో చేతులు కలిపి 1989 లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసింది.  ఈ ఎన్నికలలో  కాంగ్రెస్ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినప్పటికీ అధికారం మాత్రం దక్కించుకోలేకపోయింది.
 
 ఈ ఎన్నికల్లోనే ఓటింగ్  వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. యువ ఓటర్లు ఉత్సాహంగా  ఓటుహక్కు వినియోగించుకున్నప్పటికీ ఢిల్లీ ఓటర్లు మాత్రం ఓటు హక్కును వినియోగించుకోవడంపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. 57 లక్షల ఓటర్లలో దాదాపు 31 లక్షల మంది మాత్రమే ఓటువేశారు. ఈ ఎన్నికల్లో ఏడు స్థానాలకు 237 మంది పోటీపడ్డారు.
 ఢిల్లీ రాజకీయాలలో  కాంగ్రెస్ ఆధిపత్యానికి బీజేపీ నుంచి సవాలు ఈ ఎన్నికలతో ప్రారంభమైంది. ప్రతిపక్షం ఒక్కటైతే  తాను చిత్తు కాకతప్పదన్న విషయం కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలతో తెలిసివచ్చింది. 1989 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాలను, జనతా దళ్ ఒక్క స్థానాన్ని, కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. ఈ రెండు స్థానాలు కూడా ప్రతిపక్షంలో అనైక్యత కారణంగానే కాంగ్రెస్‌కు దక్కాయి.
 
న్యూఢిల్లీ  సీటు నుంచి  బీజేపీ అధ్యక్షడిగా ఉన్న ఎల్ కే అద్వానీ గెలుపు  ఢిల్లీ ఫలితాలలో ప్రధాన ఆకర్షణగా మారింది. ఆయన కాంగ్రెస్‌కు చెందిన మోహినీ గిరీని ఓడించారు. సౌత్ ఢిల్లీ, సదర్, కరోల్‌బాగ్  స్థానాలను కూడా బీజేపీ గెలుచుకుంది.  ఈస్ట్ ఢిల్లీ, చాందినీ చౌక్‌లో ఓట్ల చీలిక కాంగ్రెసకు కలిసిరావడంతో  హెచ్‌కేఎల్ భగత్, జైప్రకాశ్ అగర్వాల్ గెలుపొందారు.
 
ఈస్ట్ ఢిల్లీలో  కేంద్ర మంత్రి హెచ్‌కేఎల్ భగత్ ఓటమి ఖాయంగా కనిపించినప్పటికీ తనకు సన్నిహితుడైన చాంద్‌రామ్‌కు టికెట్ ఇవ్వాలని దేవీలాల్ పట్టిన పంతం ఓట్ల  చీలికకు దారితీసింది. దాంతో జనతాదళ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిషోరీలాల్  నాలుగవ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
 
ఇండిపెండెంట్‌గా పోటీచేసిన రామ్‌కు రెండవ స్థానం దక్కగా  బీఎస్పీ నేత కాన్షీరామ్ మూడవ స్థానంలో నిలిచారు. ఔటర్ ఢిల్లీలో మాత్రం జనతాదళ్ అభ్యర్థి తారిఫ్ సింగ్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ భరత్ సింగ్‌ను ఓడించారు.
 
సౌత్ ఢిల్లీలో సుభాష్ చోప్రాపై మదన్‌లాల్ ఖురానా గెలిచారు. ఢిల్లీ అధ్యక్షుడు ఖురానాను అభ్యర్థిగా నిలపడం ద్వారా పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను పైకి  తీసుకురావడానికి నడుం బిగించింది. ఈ  నియోజకవర్గం నుంచి గెలిచిన  మదన్‌లాల్ ఖురానా  ఆ తరువాత ఢిల్లీలో బీజేపీని బలమైన శక్తిగా తీర్చిదిద్దారు.
 
 ఢిల్లీకి రాష్ట్రహోదా డిమాండ్‌ను  ఆయన గట్టిగా వినిపించారు. సదర్‌లో విజయ్‌కుమార్ మల్హోత్రా కేంద్ర మంత్రి జగదీశ్ టైట్లర్‌ను భారీ తేడాతో ఓడించారు.  కరోల్‌బాగ్ నుంచి కల్కాదాస్ కాంగ్రెస్ అభ్యర్థి ధరమ్‌దాస్‌పై నెగ్గారు.
 
ఢిల్లీ కాంగ్రెస్‌లో దిగ్గజంగా వెలుగుతోన్న  హెచ్‌కేఎల్ భగత్ తన అభ్యర్థులుగా బరిలోకి దింపిన మోహినీ గిరీ, ధరమ్‌దాస్, సుభాష్ చోప్రా ఓడిపోవడంతో క్రమంగా ఢిల్లీ కాంగ్రెస్‌లో ఆయన ప్రాభవం తగ్గుముఖం పట్టింది.

మరిన్ని వార్తలు