నోట్ల రద్దుపై నోరు మెదపరేం బాబు?

20 Nov, 2016 20:30 IST|Sakshi
నోట్ల రద్దుపై నోరు మెదపరేం బాబు?

అమరావతి : పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగాను, రాష్ట్రంలోను ఓ అసాధారణ పరిస్థితి నెలకొందని, అయినా రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులు, నష్టాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడంలేదని శాసనమండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులు, దినసరి కూలీలు, పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

డబ్బుల కోసం బ్యాంకుల, ఏటీఎంల వద్ద క్యూ లైన్‌లో గంటల తరబడి నిలుచుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నా.... సీఎం చంద్రబాబు స్పందించడంలేదని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులను సమీక్షించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన చంద్రబాబు బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుని నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అద్భుతమని పొగడటం దారుణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రవర్తన అత్యంత బాధ్యతారాహిత్యంగాను, దుర్మార్గంగాను ఉందని ధ‍్వజమెత్తారు.

పెద్ద నోట్ల రద్దు కోసం ప్రధానికి లేఖ రాసిన సీఎం అందువల్ల ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి సూచనలు చేయలేదా? అని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో వ్యాపార, వాణిజ్య లావాదేవీలు మందగించడంతో రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు. నోట్ల రద్దుతో తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఢిల్లీ వెళ్లి ప్రధానికి స్వయంగా కలిసి పరిస్థితులు వివరిస్తే చంద్రబాబు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై సవివరణమైన ప్రకటన విడుదల చేయాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు