'మోసం, దగా టీఆర్ఎస్ రక్తంలోనే..'

20 Oct, 2016 20:33 IST|Sakshi
'మోసం, దగా టీఆర్ఎస్ రక్తంలోనే..'
మహబూబాబాద్ : రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిగా అమలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఆరోపించారు. మహబూబాబాద్లో గురువారం కాంగ్రెస్ రైతు గర్జన సదస్సు నిర్వహించారు. రుణమాఫీ అమలు చేయాలంటూ  దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.
 
ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ..మోసం, దగా టీఆర్ఎస్ పార్టీ రక్తంలోనే ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. రూ.70 వేల కోట్లు అప్పులు చేసి కాంట్రాక్టర్లకే కట్టబెట్టారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని జైపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పదేళ్ల పాలన రైతురాజ్యంగా సాగిందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. అరాచకంగా మారిన పాలనను నుండి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ రక్షిస్తుందని చెప్పారు.  
 
మరో నేత ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ...బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మభ్యపెడుతూ...సీఎం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల పాటు రుణమాఫీ దరఖాస్తుల ఉద్యమం కొనసాగుతుందన్నారు. రైతుల దరఖాస్తులను డిసెంబర్ 2న హైదరాబాద్లో నిర్వహించే బహిరంగ సభలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అందిస్తామన్నారు. ఆయన ఆ దరఖాస్తులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సమర్పిస్తారని ఉత్తమ్ తెలిపారు.
 
 
>
మరిన్ని వార్తలు