పవర్‌పై చార్జ్!!

4 Jan, 2014 22:40 IST|Sakshi

 ముంబై: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను తగ్గించాలనే డిమాండ్ రోజురోజుకు మరింత రాజుకుంటుంది. విద్యుత్ చార్జీలను తగ్గించాలని మొన్న విదర్భ జనాందోళన్ సమితి ముఖ్యమంత్రిని కొరగా నిన్న కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరుపమ్. 500 యూనిట్లలోపు వినియోగదారుల విద్యుత్ చార్జీలను సగానికిపైగా తగ్గించాని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. నిన్నమొన్నటిదాకా లేఖలకే పరిమితమైన ఈ డిమాండ్ శనివారం హెచ్చరికల స్థాయికి చేరింది. విద్యుత్ టారిఫ్‌ను తగ్గించకపోతే ఉద్యమిస్తామని, ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తూ సంజయ్ నిరుపమ్ ఈసారి కాస్త స్వరం పెంచారు. విద్యుత్ టారిఫ్ తగ్గింపు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోనట్లయితే ఈ నెల 13న రిలయన్స్ ఎనర్జీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ‘ఫిక్స్‌డ్ చార్జిల పేరుతో గత ఏడాది రెండేళ్లుగా నగరవాసులపై భారం మోపుతున్నారు.

ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఆస్తుల క్రమబద్ధీకరణ సాకుతో నగరంలో రిలయన్స్ ఎనర్జీ మౌలిక వసతులను కల్పిస్తోంది. ఈ పేరుతో రూ. 522 కోట్ల నుంచి రూ. 600 కోట్ల భారం ప్రజలపైనే మోపుతున్నారు. 500 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్నవారు కూడా ఈ భారాన్ని మోయాల్సి వస్తోంది. దీనిని వెంటనే ఆపివేయాలి. ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోనట్లయితే 13వ తేదీని భారీ మోర్చా చేపడతాం. ఒకవేళ ఆ లోపు నిర్ణయం వెలువడితే మోర్చా రద్దు చేసుకునే విషయమై ఆలోచిస్తామ’ని నిరుపమ్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.  భారమంతా ప్రభుత్వంపైనే మోపాల్సిన అవసరం లేదని, వ్యాపారం చేసుకుంటూ లాభాలు పొందుతున్న ప్రైవేటు కంపెనీలు కూడా కొంత భారం మోయాల్సిందేనన్నారు.

గృహ వినియోగదారులకు ఊరట కలిగేలా ఒకట్రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తాము ఆశిస్తున్నామన్నారు. విద్యుత్ అమ్మకంపై పన్నును 15 శాతం తగ్గించుకుంటుందా? లేక కంపెనీలకు సబ్సిడీ ఇస్తుందా? అనే విషయమై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. పన్నును తగ్గించుకున్నట్లయితే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని, సబ్సిడీ ఇచ్చినట్లయితే ప్రభుత్వ ఖర్చు పెరుగుతుందని, ప్రజలకు ఊరట కలిగించేందుకు చివరకు భారమేదైనా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమై తాను రాసిన లేఖపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞలు చెప్పారు. అయితే ఒకట్రెండు వారాల్లో నిర్ణయం వస్తుందని ఆశిస్తూ.. వేచిచూస్తామని, అలా జరగనట్లయితే ఉద్యమించక తప్పదని హెచ్చరించారు.

 దక్షిణ ముంబై నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న నిరుపమ్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడైనప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం పేదలకు తక్కువ ధరకే విద్యుత్‌ను అందిస్తున్నప్పుడు భారీగా ఆధాయమున్న మహారాష్ట్ర ఎందుకు ఇవ్వరాదంటూ ఎంపీ ప్రశ్నిస్తుండడాన్ని చాలా మంది సమర్థిస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మేలు జరిగేలా పథకం ప్రకారమే నిరుపమ్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, విద్యుత్ చార్జీలు తగ్గింపు కీర్తి అంతా కాంగ్రెస్‌కే దక్కేలా ఆయన వ్యూహాన్ని అమలు చేస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు.

అయితే ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్రంలో కూడా అమలు చేయాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయని, ఇది రాష్ట్రంలో ఆప్ పార్టీ మరింత బలపడేందుకు ఉపయోగపడుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. అందుకే ఆప్ కంటే ముందే తామే చొరవ తీసుకొని  సదరు పథకాలను అమలు చేసి, కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలనే ఉద్దేశంతో నే ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

మరిన్ని వార్తలు