ఇలాగైతే ఎలా?

25 Feb, 2015 02:16 IST|Sakshi
ఇలాగైతే ఎలా?

కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నవారిపై చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో కష్టమేనని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. అన్నింటికీ హైకమాండ్ అనుమతి పొందాలంటే ఎలా అంటూ మంగళవారం జరిగిన టీఎన్‌సీసీ సమావేశంలో జాతీయ నేతలను నిలదీశారు.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి :రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ సంస్కరణలు చేపట్టేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్‌వాస్నిక్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ను నాలుగు మండలాలుగా విభజించి ఆయా జిల్లాల అధ్యక్షులతో సమావేశాలు జరుపుతున్నారు. ఇప్పటికి మూడు మండలాలు పూర్తికాగా నాలుగో మండల సమావేశం మంగళవారం చెన్నైలోని సత్యమూర్తి భవన్ (పార్టీ రాష్ట్రశాఖ కార్యాలయం)లో నిర్వహించారు. చెన్నై మండల పరిధిలోని కాంచీపురం, తిరువళ్లూరు తదితర 11 జిల్లాలకు చెందిన అధ్యక్షులు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన నేతల్లో అధిక శాతం హైకమాండ్‌పై తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం, అతని కుమారుడు కార్తి చిదంబరంలో మూడు నెలలుగా పార్టీని అల్లకల్లోలం చేస్తున్నారు. వేరు సమావేశాలు నిర్వహించడం, పార్టీని చీలికదిశగా తీసుకెళ్లడం, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌పై ప్రత్యక్ష విమర్శలు గుప్పించడం ద్వారా వర్గపోరు సాగిస్తున్నారు.
 
  తండ్రీ కొడుకుల వ్యవహారం టీఎన్‌సీసీకి తలనొప్పిగా పరిణమించగా సోనియా, రాహుల్‌కు చెప్పుకోవడం మినహా మరేమీ చేయలేని నిస్సహాయతను ఇళంగోవన్ ఎదుర్కొంటున్నారు. పీ చిదంబరానికి హైకమాండ్ వద్ద మంచి పలుకుబడి ఉన్న కారణంగా సోనియా, రాహుల్ సైతం చూసి చూడనట్లు ఊరుకుంటున్నారు. రాష్ట్రంలో గడ్డుపరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్‌ను గట్టెక్కించాలని ముకుల్‌వాస్నిక్ చేస్తున్న బోధనలను క్యాడర్ తిప్పికొట్టింది. పార్టీలో కొనసాగుతున్న వేర్పాటు వాదుల పనిపట్టే అధికారాలు లేని టీఎన్‌సీసీ పదవి వల్ల ఎంతమాత్రం మేలులేదని వారు స్పష్టం చేశారు. ప్రతి చిన్న విషయానికి డిల్లీకి వెళ్లి హైకమాండ్ అనుమతి పొందే విధానానికి స్వస్తి పలకాలని ముకుల్‌వాస్నిక్‌కు వారు విజ్ఞప్తి చేశారు.
 
 రాహుల్ విశ్రాంతి తప్పుకాదు
 కాంగ్రెస్ సమావేశం ముగిసిన అనంతరం ఇళంగోవన్ మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు రాహుల్‌గాంధీ హాజరుకాకపోవడంపై వస్తున్న విమర్శలపై స్పందించారు. రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకోవడంలో ఎంత మాత్రం తప్పులేదు, ప్రధానిగా ఉన్నపుడు వాజ్‌పేయి కూడా తీసుకున్నారని వెనకేసుకు వచ్చారు. చిదంబరం, కార్తీ చేస్తున్న విమర్శలపై మాట్లాడి తన సమయాన్ని వృథా చేసుకోనని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో డీఎండీకే ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను నిరసిస్తూ అండగా నిలిచిన కాంగ్రెస్, డీఎంకే పార్టీలకు డీఎండీకే అధినేత విజయకాంత్ ధన్యవాదాలు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు