బరిలో రెబల్స్

12 Aug, 2015 02:10 IST|Sakshi
బరిలో రెబల్స్

అయోమయంలో కాంగ్రెస్ పెద్దలు     
పోటీలో 624 మంది స్వతంత్రులు      నేతల బుజ్జగింపులు
198 వార్డులకు 2,037 నామినేషన్లు...

 
బెంగళూరు : ఈనెల 22న జరగనున్న బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికలకు గాను మొత్తం 198 వార్డులకు  2,037 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో  కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లతో పాటు బీఎస్‌పీ, కేజేపీ, సీపీఎంలకు చెందిన అభ్యర్థులు కూడా ఉన్నారు. కాగా, 624 మంది స్వతంత్రులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్, బీజేపీల్లో టికెట్ లభించని కొంతమంది ఆశావహులు చివరి నిమిషంలో జేడీఎస్‌లో చేరి పోటీకీ దిగగా, మరికొంత మంది తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. కాగా, ఈ బీబీఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువగా కనిపిస్తోంది. కాంగ్రెస్ టికెట్ దక్కని అనేక మంది రెబల్స్‌గా పోటీలో నిలబడ్డారు. వీరి కారణంగా ఆయా వార్డుల్లో తమ అభ్యర్థుల విజయావకాశాలు దెబ్బతింటాయని భావించిన కాంగ్రెస్ పార్టీ వారిని అనునయించే  దిశగా చర్యలు ప్రారంభించింది. నామినేషన్‌ల ఉప సంహరణకు ఈనెల 13 వరకు గడువు ఉండడంతో వీలైనంత వరకు రెబల్ అభ్యర్థులకు నచ్చజెప్పి వారు నామినేషన్‌లను ఉప సంహరించుకునేలా చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకు గాను ఇప్పటికే కేపీసీసీ చీఫ్ జి.పరమేశ్వర్ స్వయంగా ఆయా రెబల్ అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
 
అందరికీ టికెట్‌లు అసాధ్యం కదా......

 కాగా, బీబీఎంపీ ఎన్నికల బరిలో నిలిచిన రెబల్ అభ్యర్థులు వెంటనే తమ నామినేషన్‌లను ఉప సంహరించుకోవాలని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ కోరారు. మంగళవారమిక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. స్థానికులు, స్థానిక నేతల అభిప్రాయాలను అనుసరించే బీబీఎంపీ పరిధిలోని 198 వార్డుల్లోనూ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో పార్టీలోని అందరికీ టికెట్‌లు ఇవ్వడం సాధ్యం కాదనే విషయాన్ని కార్యకర్తలు గుర్తించాలని అన్నారు. రెబల్ అభ్యర్థులు తమ నామినేషన్‌లను ఉప సంహరించుకొని, పార్టీ ప్రకటించిన అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని పరమేశ్వర్ కోరారు. పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని అన్నారు.         
 
 

మరిన్ని వార్తలు