కాంగ్రెస్ చిత్తు చిత్తు

9 Dec, 2013 01:58 IST|Sakshi
కాంగ్రెస్ చిత్తు చిత్తు

 జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి బీజేపీ తిరుగులేని మెజారిటీ సాధించింది. బలమైన ప్రభుత్వ వ్యతిరేక పవనాలు కాంగ్రెస్‌ను దెబ్బతీయగా.. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ప్రచారం ఆ పార్టీకి లాభించింది. మొత్తం 200 శాసనసభ స్థానాలకు గాను 199 స్థానాలకు ఎన్నికలు జరగగా.. ప్రతిపక్ష బీజేపీ 162 స్థానాలు గెలుచుకుని తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. అధికార కాంగ్రెస్ కేవలం 21 స్థానాలకు పరిమితమై ఘోర పరాజయం చెందింది. బీజేపీ బలం 78 సీట్ల నుంచి 162కి పెరగగా.. కాంగ్రెస్ బలం 96 సీట్ల నుంచి 21కి పడిపోయింది. తాజా ఎన్నికల్లో స్వతంత్ర సభ్యులు 7 సీట్లు, ఎన్‌పీపీ 4 సీట్లు, బీఎస్‌పీ 3 సీట్లు, ఇతరులు 2 సీట్లు గెలుచుకున్నారు. చురు నియోజకవర్గంలో బీఎస్‌పీ అభ్యర్థి మరణంతో ఎన్నిక వాయిదా పడింది. మొత్తం మీద బీజేపీ రికార్డు స్థాయిలో 46 శాతం ఓట్లు కొల్లగొట్టింది. కాంగ్రెస్‌కు పోలైన ఓట్ల శాతం 34కు పడిపోయింది. (2008 ఎన్నికల్లో బీజేపీకి 34.27 శాతం ఓట్లు పోలవగా.. కాంగ్రెస్‌కు 36.82 శాతం ఓట్లు పోలయ్యాయి.)
 
 వసుంధర భారీ విజయం...
 బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధరరాజె ఝాలార్పతన్ నియోజకవర్గం నుంచి 60,896 ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి చంద్రావత్‌పై గెలుపొందారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్ సర్దార్‌పురా నియోజకవర్గం నుంచి సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి శంభూసింగ్ ఖేతేశ్వర్‌పై 18,478 ఓట్లతో గెలిచారు. గెహ్లాట్ సొంత జిల్లా అయిన జోద్‌పూర్‌లో గల పది అసెంబ్లీ స్థానాల్లో 9 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. మిగతా ఒక్క సీటులో గెహ్లాట్ గెలిచారు. రాష్ట్రంలో ఓటమిని అంగీకరించిన గెహ్లాట్.. ఆదివారం నాడే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ మార్గరెట్ అల్వాకు లేఖ సమర్పించారు.
 
 పీసీసీ చీఫ్, స్పీకర్ పరాజయం...
 ఈ ఎన్నికల్లో రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు చంద్రభాన్, అసెంబ్లీ స్పీకర్ దీపేంద్రసింగ్‌ల వంటి పలువురు హేమాహేమీలు పరాజయం పాలయ్యారు. మాంద్వా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి నరేందర్‌కుమార్ చేతిలో చంద్రభాన్ ఓడిపోయారు. దీపేంద్రసింగ్ శ్రీమధోపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఝాబర్‌సింగ్ ఖార్రా చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ మంత్రివర్గంలోని 19 మందిలో ముగ్గురు మినహా మొత్తం మంత్రులూ మట్టికరవటం విశేషం. కాంగ్రెస్ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ చంద్రభాన్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతక విజేత కృష్ణపునియా, ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ మమతాశర్మ వంటి ప్రముఖులు కూడా ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.
 
 మోడీ ప్రభావంతోనే గెలిచాం
 రాజస్థాన్‌లో బీజేపీ విజయం రాష్ట్ర ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అంకితం. ఈ గెలుపు వెనుక మా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ప్రభావం బలంగా ఉంది. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ పాలనారాహిత్యంతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు. గుజరాత్‌లో అభివృద్ధి జరుగుతోందని మోడీ చూపించారు. ఆ నమూనాను ఎక్కడైనా అనుసరించవచ్చని చూపారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఇలాగే చేయగలిగాయి. ఈ దేశ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇవి సెమీ ఫైనల్ ఎన్నికలు. అతి త్వరలో దేశంలో కూడా ఇది పునరావృతం కాబోతోంది. కేంద్రంలో మోడీ నేతృత్వంలో మా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.  రాష్ట్రాన్ని మళ్లీ తన కాళ్లపై నిలబెట్టేందుకు మేం మంచి కృషి చేస్తాం. ప్రధానంగా రాష్ట్ర ప్రజలను బలోపేతం చేస్తాం.
 - వసుంధరరాజె, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి
 
 మాపై దుష్ర్పచారంతో గెలిచారు...
 మా (కాంగ్రెస్) ప్రభుత్వం మంచి పాలనను అందించింది. సంక్షేమ పథకాలతో  ప్రజలకు లబ్ధి కూడా చేకూర్చాం. కానీ ఓటర్ల మనసులో ప్రతిపక్ష బీజేపీ తప్పుడు అభిప్రాయం సృష్టించగలిగింది. ఈ అంతర్లీన వ్యతిరేకత ఉన్నట్లయితే దానిని ఇక ఏమీ చేయలేం. ఈ ప్రాతిపదికగానే ప్రజలు ఓటు వేసినట్లు కనిపిస్తోంది. రాజస్థాన్‌లో ఏ ప్రభుత్వం ఏం చేసిందనే దానిపై మా ప్రచారాన్ని కేంద్రీకరించాం. కానీ దీనిని, అభివృద్ధిని ఎన్నికల అంశంగా చేయటంలో మేం విఫలమయ్యాం. ప్రతిపక్షం మాపై దుష్ర్పచారం కానీ అభివృద్ధి గురించి మాట్లాడలేదు. వారు తప్పుడు అభిప్రాయం సృష్టించారు. వసుంధరరాజె ‘నమో’ (నరేంద్రమోడీ) పేరు చెప్పి ఓట్లు అడిగారు. కాబట్టి రాజస్థాన్‌లో గెలుపు ఆమె గెలుపు కాదని నేను భావిస్తున్నా.     - అశోక్‌గెహ్లాట్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
 

>
మరిన్ని వార్తలు