డీఎంకేతో కాంగ్రెస్ కటీఫేనా?

13 Oct, 2016 01:42 IST|Sakshi

    స్టాలిన్ ప్రకటనపై విభేదం
     61 జిల్లాల కార్యదర్శులతో సమావేశం
     కావేరీ, స్థానిక  ఎన్నికలపైనా చర్చ
ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం, 21 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స రాష్ట్రంలో రాజకీయ సమీకరణలను మార్చివేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డీఎంకే, కాంగ్రెస్‌ల మధ్య అగాధం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. - సాక్షి ప్రతినిధి, చెన్నై

తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షులుగా తిరునావుక్కరసర్ నియమితులైన తరువాత రాష్ట్రంలో పార్టీ జవసత్వాలు పుంజుకునే ప్రయత్నాలను ప్రారంభించారు. పార్టీలోని అన్ని వర్గాలను తొలుత కలుపుకుపోయినట్లుగా వ్యవహరిస్తూనే తాజా మాజీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ వర్గంపై కొరడా ఝుళిపించారు. తిరునావుక్కరసర్ బాధ్యతలు చేపట్టిన కొత్తల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకురావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో ఏర్పడిన చెలిమి నేపథ్యంలో మరోసారి చేతులు కలిపారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన స్థానాలను కేటాయించడంపై డీఎంకే విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

డీఎంకే వైఖరితో తిరునావుక్కరసర్ మనస్తాపానికి గురయ్యారు. ఇరుపక్షాలు సంధి చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరించింది. డీఎంకేతో కాంగ్రెస్‌కు బెడిసికొట్టింది అని ప్రచారం జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ రాక మరింత చర్చకు దారితీసింది. డీఎంకే రాజకీయ శతృపక్షమైన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యంపై వాకబు చేయడమే పనిగా పెట్టుకుని రాహుల్‌గాంధీ అపోలోకు రావడం డీఎంకే శ్రేణులను విస్మయానికి గురిచేసింది. తిరునావుక్కరసర్ సూచన మేరకు డీఎంకేతో కటీఫ్ చెప్పి అన్నాడీఎంకేకు చేరువ  కావడమే రాహుల్ రాకలోని అంతరార్థమని రెండు పార్టీల్లోని నేతలు గుసగుసలు పోయారు. ఈ ప్రచారానికి ఊతమిస్తున్నట్లుగా రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అవసరమని స్టాలిన్, అవసరం లేదని తిరునావుక్కరసర్ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఇచ్చారు.

ఇదేమిటని తిరునావుక్కరసర్‌ను మీడియా ప్రశ్నించగా ఎన్నికల వరకు డీఎంకే తమకు మిత్రపక్షమని, అభిప్రాయాలు కూడా ఒకటిగా ఉండాల్సిన పనిలేదని బదులిచ్చారు. ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేవు కాబట్టి కాంగ్రెస్, డీఎంకేలు ఎవరిదారిన వారు పోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన సత్యమూర్తి భవన్‌లో తిరునావుక్కరసర్ బుధవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీపరమైన 61 జిల్లా కార్యదర్శులు హాజరయ్యారు. కావే రీ జల వివాదంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు, డీఎంకే సీట్ల  కేటాయింపు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్యనేతలతో అనేక అంశాలపై మాట్లాడుతూనే ఇతర అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.
 

మరిన్ని వార్తలు