కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పండి

9 Sep, 2015 04:29 IST|Sakshi
కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పండి

- ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ నేతలు ప్రజల ముందుకు వస్తారు
- బీజేపీకి ఓటుతోనే 12వ వార్డు అభివృద్ధి సాధ్యం
- బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి
 సాక్షి, బళ్లారి :
బళ్లారి మహానగర పాలికెలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నగరాభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, అలాంటి పార్టీకి ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన బళ్లారి లోక్‌సభ మాజీ సభ్యురాలు జే.శాంత, బీజేపీ అభ్యర్థి శశికళతోపాటు వందలాది మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు మంగళవారం నగరంలో 12వ వార్డు పరిధిలోని వివిధ కాలనీల్లో ఇంటింటా ప్రచారం చేపట్టారు.

వార్డు పరిధిలోని కొలిమిచౌక్, రెడ్డికాలనీ, ఖాజాసాబ్ వీధి, అగసర వీధి తదితర కాలనీల్లో ఇంటింటా బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఆయా కాలనీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటా ప్రచారం చేయడంతో బీజేపీ నాయకులకు వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈసందర్భంగా గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ... బళ్లారి నగరంలో అభివృద్ధి పనులు ఏ మాత్రం జరగడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వస్తారని గుర్తు చేశారు.

ఎన్నికలు ముగిసినా తర్వాత  కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ వైపు కన్నెత్తి చూడరన్నారు. ఇలాంటి నేతలను నమ్మి ఓటు వేయవద్దని ఓటర్లు సూచించారు. బళ్లారి నగరాన్ని తాము అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శశికళను గెలిపించి నగరాభివృద్ధికి సహకరించాలని సూచించారు. బళ్లారి లోక్‌సభ మాజీ సభ్యురాలు జే.శాంత మాట్లాడుతూ... బళ్లారి నగరాన్ని గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు ఎంతో అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరకు కార్పొరేటర్లు కూడా నగరాభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడంతో నగరంలో అభివృద్ధి పనులు అస్తవ్యస్తంగా మారిపోయాయన్నారు. నగరాభివృద్ధి జరగాలంటే అది బీజేపీ ద్వారానే  సాధ్యం అని పేర్కొన్నారు.

ఈనెల 13వ తేదీన జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శశికళను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లుకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అభ్యర్థి శశికళ మాట్లాడుతూ... తనకు 12వ వార్డు ఓటర్లు, శ్రీరాములు, గాలి సోమశేఖరరెడ్డి తదితర బీజేపీ నేతల ఆశీస్సులతో ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించిందని, వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, ప్రతి ఒక్కరు తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆయా కాలనీల్లో శశికళ వృద్ధులకు పాదాభివందనం చేస్తూ ప్రచారం చేయడంతో అందరిని ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కార్పొరేటర్లు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, మాజీ కార్పొరేటర్ కేఎస్.దివాకర్, జిల్లా బీజేపీ నాయకులు రామలింగప్ప, జిల్లా బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు సుమారెడ్డి, మాజీ జెడ్పీ ఉపాధ్యక్షురాలు మంజమ్మ, బీజేపీ నాయకులు గురులింగనగౌడ, గాదిలింగనగౌడ, హనుమంతప్ప, మాజీ మేయర్ ఇబ్రహీంబాబు, వీరశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు