పోటెత్తిన నామినేషన్లు.. 

15 Nov, 2018 15:10 IST|Sakshi

మూడోరోజు 37 మందిదాఖలు

హుజురాబాద్‌లో మంత్రి ఈటలతోపాటు ఆరుగురు 

పలుచోట్ల టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెబల్స్‌ నామినేషన్‌పొన్నం ప్రభాకర్, గంగుల కమలాకర్, బండి సంజయ్‌ ఒకేరోజు దాఖలు

చొప్పదండిలో బీజేపీ అభ్యర్థిగా  బొడిగె శోభ నామినేషన్‌ 

సాక్షి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మూడో రోజు భారీగా నామినేషన్‌లు దాఖలయ్యాయి. మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు 37 మంది 43 సెట్లలో నామినేషన్‌లు వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అత్యధికంగా హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు ఆరుగురు ఏడు సెట్లలో నామినేషన్‌ వేశారు. మంత్రి రాజేందర్‌ తరఫున ఆయన సతీమణి ఈటల జమునారెడ్డి పాల్గొన్నారు. చొప్పదండి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొడిగె శోభ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయకుండానే బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయగా, హుస్నాబాద్‌లో సీపీఐ అభ్యర్థిగా చాడ వెంకటరెడ్డి తరఫున ఆ పార్టీ, నాయకులు, కార్యకర్తలు నామినేషన్‌ వేశారు. 

మూడో రోజు జోరుగా నామినేషన్లు..
ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నామినేషన్‌ల పర్వం ఊపందుకుంది. మూడో రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కాంగ్రెస్‌ అభ్యర్థిగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్‌ నామినేషన్‌ వేశారు. అటు హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌ తరఫున ఆయన సతీమణి ఈటల జమున నామినేషన్‌ వేశారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశిస్తున్నప్పటికీ ఇంకా పేరు ఖరారు కాకపోయినా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాడి కౌశిక్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. మానకొండూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆరెపల్లి మోహన్, బీజేపీ అభ్యర్థిగా గడ్డం నాగరాజు నామినేషన్‌ వేశారు. 

చొప్పదండిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొడిగె శోభ బీజేపీ అభ్యర్థిగా ఆమె అనుచరులు నామినేషన్‌ వేశారు. అటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం ఖరారు కాకపోయినా టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. హుస్నాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వొడితెల సతీష్‌కుమార్‌ నామినేషన్‌ వేయగా, కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం ఖరారు కాకున్నా కాంగ్రెస్‌ అభ్యర్థిగా అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. పొత్తుల్లో భాగంగా సీపీఐ అభ్యర్థిగా చాడ వెంకటరెడ్డి తరఫున ఆ పార్టీ కార్యకర్తలు నామినేషన్‌ వేశారు. కరీంనగర్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన వారు ఎవరికి వారే గెలుపు ధీమాతో ఉన్నారు. ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్నవని పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

తనకు అవకాశం ఇస్తే ఆదర్శ నియోజకవర్గంగా మార్చుతానని తెలిపారు. ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు పాపపు సొమ్ముతో తెలంగాణాలో ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి కూటమి కట్టి తెలంగాణాలో కాలుమోపాలని చూస్తున్న చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని కోరారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారని.. ఈసారి తనకు అవకాశం ఇస్తే కరీంనగర్‌కు రక్షణ కవచంగా నిలుస్తానని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కోరారు. 

పోటాపోటీగా నామినేషన్లు.. ముఖ్య నేతల హాజరు..
పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దాసరి మనోహర్‌రెడ్డి నామినేషన్‌ వేయగా, ఆయన సతీమణి పుష్పలత స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా సీహెచ్‌ విజయరమణారావు నామినేషన్‌ వేయగా కాంగ్రెస్‌ రెబల్‌గా సురేష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల రామకృష్ణారెడ్డి నామినేషన్‌ వేశారు. రామగుండంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎం.ఎస్‌.రాజ్‌ఠాకూర్‌ నామినేషన్‌ వేయగా టీఆర్‌ఎస్‌ రెబల్‌గా కోరుకంటి చందర్‌ భారీ ర్యాలీ నిర్వహించి అట్టహాసంగా నామినేషన్‌ వేశారు. 

మంథనిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి శ్రీధర్‌ బాబుతోపాటు మారో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. ధర్మపురిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్, బీజేపీ అభ్యర్థిగా కన్నం అంజయ్య, జగిత్యాలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా డాక్టర్‌ సంజయ్‌కుమార్, బీజేపీ అభ్యర్థిగా ముదుగంటి రవీందర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. కోరుట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎంపీ కవితతో కలిసి నామినేషన్‌ వేశారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రమేష్‌బాబు, సిరిసిల్లలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేకే మహేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మల్లుగారి నర్సాగౌడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.  

మరిన్ని వార్తలు