‘దయచేసి ప్రతిపాదనలు పంపకండి’

24 Sep, 2016 16:32 IST|Sakshi
‘దయచేసి ప్రతిపాదనలు పంపకండి’
 హైదరాబాద్: ‘దశలవారీగా కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తాం.. అంతేకాదు ఇంటికొక ఉద్యోగం కల్పిస్తాం.. ఉద్యోగాలు కల్పించలేక పోతే ఒక్కొక్కరికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలు ఇస్తాం...’  సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు. వీటిని మర్చిపోక ముందే 40 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల కల చెదిరిపోయింది. నాలుగు రోజుల కిందట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు ఎవరినీ రెగ్యులరైజ్ చెయ్యలేమని చెప్పటం ఇందుకు కారణం. 
 
ఆర్థిక శాఖే తిరస్కరించింది
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రతిపాదనను స్వయానా ఆర్థిక శాఖే తిరస్కరించిందంటే ప్రభుత్వమే వెనుక నుంచి ఇలా చేయించినట్లు అవగతమవుతుంది. కొన్ని నెలల క్రితం ఆరోగ్యశాఖ నుంచి 3500 మంది ఉద్యోగులకు సంబంధించి రెగ్యులరైజేషన్ ప్రతిపాదన ఆర్థిక శాఖకు పంపిస్తే ఫైలును తిరస్కరించారు. ఆ తర్వాత మళ్లీ ఒకసారి ప్రతిపాదన పంపినా వెనక్కే వచ్చింది. పదే పదే ప్రతిపాదనలు పంపించవద్దని, రెగ్యులరైజేషన్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారమూ లేనప్పుడు మీరు ప్రతిపాదనలు పంపించడంలో అర్థం లేదని చెప్పింది. దీంతో ఇక ఏ శాఖ నుంచి కూడా ఉద్యోగుల వివరాలు, వారి వేతనాల వివరాలు, సర్వీసు, తదితర వివరాలేవీ పంపించడం లేదు. మంత్రులే నాన్నెళ్లకోసారి మీటింగు పెట్టి ఏదో ఒకటి మాట్లాడి వెళ్లిపోతున్నారు.
 
కేబినెట్ సబ్‌కమిటీ ఓ ఎత్తుగడే..!
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం కేబినెట్ సబ్‌కమిటీని వేయడం కూడా ఓ ఎత్తుగడగానే ఉన్నట్టు కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 2014 సెప్టెంబర్ 9న నలుగురు మంత్రులతో కేబినెట్ సబ్‌కమిటీ వేస్తే..ఇప్పటి వరకూ ఏమీ తేల్చలేదు. సాంకేతిక కారణాలని, సుప్రీం మార్గదర్శకాలు అడ్డొస్తున్నాయని చెప్పి తప్పించుకుంటున్నారు. ఓవైపు స్వయానా హైకోర్టే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను నియమించుకోవద్దని, శాశ్వత ప్రాతిపదికన నియమించుకోవాలని చెబుతున్నా ప్రస్తుతం ఉన్న వారికి హామీ ఇవ్వడం లేదు. 
 
వేతనాలు కూడా లేవు..
రాష్ట్రంలో 40 వేల మంది వరకూ కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు రాక మూడు నెలలయింది. పశ్చిమ గోదావరి లాంటి కొన్ని జిల్లాల్లో 5 నెలల దాటినా జీతాలు లేవు. కాంట్రాక్టు వేతన జీవులు నెలకు రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.20 వేలు మాత్రమే తీసుకునే వారున్నారు. ఆ ఇచ్చే వేతనం కూడా నెలల తరబడి రాకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. 2016 ఆగస్ట్ 31తో వీరి పదవీకాలం ముగిసింది. అయినా ఇప్పటివరకూ కొనసాగింపు ఉత్తర్వులివ్వలేదు.
మరిన్ని వార్తలు