రసాయనాల పరిశ్రమ స్థాపనకు సహకారం

22 Jun, 2014 03:31 IST|Sakshi
  •  కేంద్ర మంత్రి అనంత భరోసా
  •  
    సాక్షి ప్రతినిధి, బెంగళూరు :  రాష్ట్రంలో ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో ఎవరైనా రసాయనాల పరిశ్రమను స్థాపించడానికి ముందుకు వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారాన్ని అందిస్తాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్ తెలిపారు. జయనగరలో రత్నా ఫౌండేషన్ శనివారం ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.

    దేశంలో రసాయన ఎరువులకు కొరత ఏర్పడ కూడదని ఆకాంక్షిం చారు. ఈ విషయంలో స్వావలంభన సాధించాల్సి ఉందన్నారు. ఈ దిశగా కర్మాగారాలను స్థాపించడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సి ఉందన్నారు. రాష్ర్టంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించిన నేపథ్యంలో రైతులు ఎరువుల కొరతను ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో లక్ష టన్నులకు బదులు లక్షన్నర టన్నుల రసాయనాలను సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మంగళూరు ఫర్టిలైజర్స్ ఎదుర్కొంటున్న రసాయనాల కొరతను తీర్చామని చెప్పారు. వచ్చే మూడు నెలల పాటు పాత పద్ధతిలోనే ఎరువులను ఉత్పత్తి చేయాలని సూచించామని తెలిపారు.
     
    జయపై విమర్శలు

     
    తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కావేరి వివాదాన్ని తిరిగి కెలకడానికి ఎంతగా ప్రయత్నించినా కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వబోదని తెలిపారు. కావేరి నిర్వహణా మండలిని ఏర్పాటు చేయకూడదని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కోరామని చెప్పారు. కావేరి నీరు  మండ్య జిల్లా రైతులకు జీవ నాడి అని, బెంగళూరు ప్రజల దాహార్తిని తీర్చుతోందని తెలిపారు.

    కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహణా మండలిని ఏర్పాటు చేయకూడదని కోరామన్నారు. అయితే జయలలిత అధికారుల ద్వారా కోర్టులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. వచ్చే నెలలో దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరిగే అవకాశాలున్నాయని చెబుతూ, అక్కడ కూడా సమర్థంగా వాదనలు వినిపించి మండలి ఏర్పాటు కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
     

మరిన్ని వార్తలు