‘బంగ్లా’ రగడ 

21 Oct, 2019 12:48 IST|Sakshi

కావేరిలో సీఎల్పీ నేత సిద్ధరామయ్య మకాం  

వారంలోగా ఖాళీ చేయాలని సర్కారు ఉత్తర్వులు  

లేదంటే నీళ్లు, కరెంటు కట్‌  

అందులోకి మారనున్న సీఎం యడియూరప్ప  

శివాజీనగర: విమర్శలు, ప్రతి విమర్శలతో వేడిమీదున్న యడియూరప్ప, సిద్ధరామయ్య మధ్య  బంగ్లా మరో వివాదమైంది. అదృష్ట నివాసంగా రాజకీయ రంగంలో గుర్తింపు పొందిన కావేరి బంగ్లా కోసం ముఖ్యమంత్రి బీ.ఎస్‌.యడ్యూరప్ప, శాసనసభా ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యల మధ్య సంఘర్షణ తారాస్థాయికి చేరింది. నాలుగు రోజుల్లోఇల్లు ఖాళీ చేయకపోతే సదుపాయాలను బంద్‌ చేయనున్నట్లు అందులో ఉంటున్న సిద్ధరామయ్యను ప్రభుత్వం హెచ్చరించడంతో ఈ రగడ రచ్చకెక్కింది. కావేరి బంగ్లా గేటుకున్న సిద్ధరామయ్య నామ ఫలకాన్ని శనివారం రాత్రి డీపీఏఆర్‌ సిబ్బంది తొలగించి, నాలుగు రోజుల్లోగా ఇంటిని ఖాళీ చేయాలని అక్కడి సిబ్బందికి స్పష్టంచేశారు. ఒకవేళ నిర్ధారించిన సమయంలోగా ఇల్లు ఖాళీ చేయకపోతే 5 రోజుల తరువాత విద్యుత్, నీటి సరఫరాతో పాటు ప్రభుత్వ సదుపాయాలను స్తంభింపజేయనున్నట్లు నోటీస్‌లో పేర్కొన్నారు. కావేరి నివాసం ఇప్పటికే ముఖ్య మంత్రి బీ.ఎస్‌.యడ్యూరప్పకు కేటాయించారు. కానీ ఇందులో ఇప్పటికీ సిద్ధరామయ్యే ఉంటున్నారు.

నిజానికి ఆయన ప్రతిపక్ష నాయకునికి కేటాయించిన రేస్‌ కోర్స్‌ రోడ్డులోని కాటేజ్‌ రేస్‌ వ్యూ– 2కు మారాలి. లేనిపక్షంలో చట్టపరంగానే ఖాళీ చేయిస్తామని అధికారులు తాజా నోటీస్‌లో తేల్చిచెప్పడం గమనార్హం. డీపీఏఆర్‌ సిబ్బంది శనివారం సిద్ధరామయ్య కార్యాలయానికి దీనిపై సమాచారం అందించగా, ఈ వారంలోగా కావేరి నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది.   ప్రస్తుతం సీఎం యడియూరప్ప నగరంలో డాలర్స్‌ కాలనీలో ఉన్న సొంత ఇంట్లో కార్యకలాపాలు చేపడుతున్నారు. ప్రతి రోజు రాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రిని కలుసుకోవటానికి వందలాది మంది వస్తుంటారు. ధవళగిరి నివాసంలో అంతమందిని కలవడానికి స్థలం లేదు. ప్రజలు రోడ్ల మీదనే నిలబడుతుంటారు, దీనివల్ల స్థానిక ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కార్యక్రమాలకు వీలుగా ముఖ్యమంత్రికి కావేరి నివాసాన్ని కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇచ్చిన గడువు పూర్తయిందని, ఇంక పొడిగించడం సాధ్యం కాదని సిద్ధరామయ్యకు స్పష్టం చేశారు. అయితే సిద్ధరామయ్య ఎలా స్పందిస్తారోనని ఉత్కంఠ నెలకొంది.     

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా