ధార్వాడ పేడాపై కరోనా నీడ 

20 Jun, 2020 08:38 IST|Sakshi

రాయచూరు ‌:  చిక్కని పాలు, చక్కెర, యాలకుల పొడి వీటికి తోడు ఎంతో నైపుణ్యం రంగరించి చేసే ధార్వాడ పేడా పేరు వింటే నోరూరని వారు ఉండరు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఆ తీయని రుచి స్వర్గాన్ని తలపిస్తుందంటారు పేడా ప్రియులు. కరోనా వైరస్‌ వల్ల అలాంటి పేడకు వ్యాపారాలు తగ్గాయి. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రా, తమిళనాడు ప్రజలు మక్కువ చూపుతారు. కరోనా వైరస్‌ భీతితో, రెండున్నర నెలల లాక్‌డౌన్‌ వల్ల ఈ మిఠాయి రాజాకు దెబ్బ తగిలింది. స్వీట్‌షాపులు మూతపడడం, కార్మికులు ఇళ్లకు వెళ్లిపోవడం తదితర కారణాలతో క్వింటాళ్ల కొద్దీ పేడా అమ్మకాలు నిలిచిపోయి లక్షల రూపాయల నష్టం సంభవించినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.(వెంటిలేటర్‌ ప్లగ్‌ తీసి కూలర్‌ పెట్టారు)


పేడా వెనుక పెద్ద కథ  
ఉత్తర కర్ణాటక భాగంలోని హుబ్లీ, ధార్వాడకు ప్రత్యేక కథ వుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అవధ్‌ బీహరీ 1933లో ధార్వాడలో పేడా దుకాణాలను ప్రారంభించారు. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి నిత్యం పెద్దమొత్తంలో తయారు చేసేలా 1955లో పేడా ఫ్వాక్టరీని స్థాపించాడు. దాని బాధ్యతలను మోసుకున్న గణేష్‌మిశ్రా దీనిని హుబ్లీకి విస్తరింప చేశారు. మిశ్రా కుటుంబం మూడోతరం కుటుంబ సభ్యుల 87 ఏళ్ల క్రితం పారంభించిన పేడాను సంజయ్‌ మిశ్రా బిగ్‌ మిశ్రా పేడాగా పేరుమార్చారు. ప్రస్తుతం ఉత్తర కర్ణాటకతో పాటు అనేకచోట్ల పేడా దుకాణాలు వెలిశాయి. కానీ ధార్వాడలో తయారయ్యే పేడాకు ఏదీ సాటిరాదంటారు. ధార్వాడ తాలుకా క్యారకొప్పలో రూ.20 కోట్లతో పేడా ఉత్పాదన చేసే పరిశ్రమను నెలకొల్పారు. పరిశ్రమలో 450 మందికి పైబడి కార్మికులు పనిచేస్తుండగా ప్రతి రోజు 2000 కేజీల పేడా మిఠాయిని ఉత్పత్తి చేసి మూడు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. కరోనా వైరస్, లాక్‌డౌన్‌ సంభవించడంతో ఇప్పుడు వెయ్యికేజీలకు ఉత్పత్తి పడిపోయిందని తెలిపారు. కొనుగోళ్లు తగ్గినట్లు చెప్పారు. నాలుగు నెలల్లో తమకు ఒక్కరికే రూ.2 కోట్ల మేర నష్టం సంభవించిందని మరో ప్రముఖ వ్యాపారి సంజయ్‌ మిశ్రా తెలిపారు.

 
అందరిపైనా ఎఫెక్టు  
మరోవైపు హుబ్లీ–ధార్వాడల్లో స్థానిక వ్యాపారులు సొంతంగా చేసి, లేదా హోల్‌సేల్‌గా కొని అమ్ముతూ ఉండేవారు. రెండున్నర నెలల పాటు షాప్‌లు మూతపడడం, ఇప్పుడిప్పుడే తెరిచినా కరోనా ప్రభావం వల్ల వ్యాపారాలు తగ్గినట్లు చెప్పారు. దీనివల్ల పాల రైతులు, పేడా తయారీ కార్మికులకు ఆదాయం పడిపోయింది. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని వాపోయారు. మళ్లీ పుంజుకోవడానికి కొంతకాలం పడుతుందని అన్నారు.  

మరిన్ని వార్తలు