కరోనా ఎఫెక్ట్‌ : వేల కోళ్లు సజీవ సమాధి

11 Mar, 2020 23:03 IST|Sakshi

బెంగళూరు : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావంతో పలు పరిశ్రమలు నష్టాలు చవిచూస్తున్నాయి. ముఖ్యంగా చికెన్‌ తింటే కరోనా విస్తరిస్తుందనే వదంతులు ప్రచారం జరగడంతో.. ఆ ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. చికెన్‌ ధరలు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ పౌల్ట్రీ నిర్వాహకుడు ప్రాణాలతో ఉన్న వేలాది కోళ్లను సజీవంగా పూడ్చిపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. బెలగావిలోని గోకాక్‌కు చెందిన నజీర్‌ అహ్మద్‌ అనే పౌల్ట్రీ నిర్వాహకుడు చికెన్‌ ధరలు భారీగా పడిపోవడంతో ఆవేదన చెందాడు. కోళ్ల పెంపకపు ఖర్చులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నాడు.

తన పౌల్ట్రీలోని 6 వేల కోళ్లను ఓ ట్రక్‌లో తరలించి పెద్ద గుంత తీసి అందులో పూడ్చిపెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి నజీర్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కోళ్లతో కరోనా వస్తుందనే వదంతుల కారణంగా చికెన్‌ ధరలు భారీగా పడిపోయాయని తెలిపారు. కోళ్ల పెంపకానికి రూ. 6 లక్షల ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పెట్టుబడి రాకపోగా.. నష్టాలు వచ్చే అవకాశం ఉన్నారు. అందుకే కోళ్లను పూడ్చిపెట్టినట్టు వెల్లడించారు. (చదవండి : కోడికి కరోనా బూచి)

మరిన్ని వార్తలు