ఏమవుతుందో ఏమో...!

26 May, 2020 13:22 IST|Sakshi
శ్రీ మందిరం లింగరాజు దేవస్థానం

ఒకే రోజున 103 పాజిటివ్‌ కేసులు

ఆందోళనలో రాష్ట్ర ప్రజలు

రథయాత్ర నిర్వహణపై సందేహాలు

భువనేశ్వర్‌: రాష్ట్రంలో కరోనా కదలికలు అంతు చిక్కడం లేదు. రాష్ట్రేతర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో ప్రజలు తరలి వస్తుండడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రజలు భీతిల్లుతున్నారు. సోమవారం ఒక్క రోజే రాష్ట్రంలో 103 మందిలో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు ఖరారయ్యాయి.  దేవ్‌గడ్‌ జిల్లా నుంచి అత్యధికంగా 22 మందిలో పాజిటివ్‌ ఖరారైంది. కేంద్రాపడా నుంచి 15 మంది, జగత్‌సింగ్‌పూర్‌ నుంచి  10 మంది, మల్కన్‌గిరి నుంచి 9 మంది, భద్రక్, బలంగీరు జిల్లాల నుంచి 8 మంది చొప్పున, కొరాపుట్, గజపతి జిల్లాల నుంచి ఆరుగురు చొప్పున, ఖుర్దా, బాలాసోర్‌ జిల్లాల నుంచి ఐదుగురు చొప్పున, గంజాం జిల్లా నుంచి నలుగురు, జాజ్‌పూర్, మయూర్‌భంజ్, కెంజొహార్, కొందమాల్, ఢెంకనాల్‌ జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున సోమవారం కరోనా బారిన పడినట్లు రాష్ట్ర ఆరోగ్య– కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. కరోనా వ్యాప్తి ప్రారంభం నుంచి సోమవారం నాడే అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం కలవరం రేపుతోంది. ఈ రోగులతో సహా రాష్ట్రంలో సమగ్రంగా  కరోనా రోగులు 1,438 మంది కాగా 550 మంది కోలుకుని ఏడుగురు మరణించారు. 881 మంది కోవిడ్‌–19 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

పూరీ జిల్లా పట్ల దృష్టి
జగన్నాథుని రథయాత్ర చేరువవుతోంది. ఈ ఏడాది యాత్ర నిర్వహణ కరోనా పోకడతో ముడిపడి ఉంది. ఈ జిల్లాలో గత 24 గంటల్లో కొత్త కేసులు నమోదు కాకపోవడంతో కొంతవరకు ఊరట కలిగించింది. అయితే నిన్న మొన్నటి వరకు పూరీ జిల్లాలో కరోనా రోగుల సంఖ్య విపరీతంగా ఉంది. జిల్లాలో సమగ్రంగా 78 మందిలో కోవిడ్‌–19 పాజిటివ్‌ ఖరారైంది. వారిలో నలుగురు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మిగిలిన వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో పాటు కోలుకున్న వారి సంఖ్య పెరిగితే తప్ప జగన్నాథుని రథయాత్ర నిర్వహణకు అనుమతి లభించే అవకాశం లేదని కలవరపడుతున్నారు.

శీతల షష్ఠికి అనుమతి
స్థానిక లింగ రాజు దేవస్థానంలో శీతల షష్ఠి ఉత్సవ నిర్వహణకు పాక్షికంగా అనుమతించారు. రాజధాని నగరంలో కరోనాపరిస్థితి కొంతమేరకు అదుపులోకి రావడంతో ఈ అనుమతులు జారీ చేశారు. శీతల షష్ఠి ఉత్సవ నిర్వహణకు స్థానిక నగర పాలక సంస్థ (బీఎంసీ) ఆంక్షలు జారీ చేసింది.   ఉత్సవ నిర్వహణలో ప్రత్యక్షంగా పాలుపంచుకునే వ్యక్తులను మాత్రమే అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. వారందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాత దేవస్థానం లోనికి అనుమతిస్తారు. భౌతిక దూరం, మాస్కులు తొడగడం వంటి కరోనా నివారణ కట్టడి కార్యాచరణ మధ్య శీతల షష్ఠి ఉత్సవం నిరాడంబరంగా ముగించాలని బీఎంసీ స్పష్టం చేసింది. దగ్గు, జలుబు లక్షణాలు ఉన్న సేవాయత్‌లకు తొలగిస్తారు. అత్యధికంగా ఏడుగురు సేవాయత్‌ల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఉత్సవం ముగించాలని బీఎంసీ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు