‘కరోనా’ భయం: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కు నో

10 Feb, 2020 08:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బెంగళూరు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు సిలికాన్‌సిటీ బెంగళూరులో ట్రాఫిక్‌ పోలీసులు కూడా హడలిపోతున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లను తాత్కాలికంగా నిలిపేశారు. సాధారణంగా వాహనదారుల నోట్లో గొట్టం పెట్టి గాలిని ఊది ఆల్కోమీటర్‌ ద్వారా మద్యం తాగిందీ.. లేనిదీ పరిశీలిస్తారు. ఇలా అనేకమంది గాలిని ఊదడం వల్ల క్రిములు ఒకరినుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదముందని భావించారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసు విభాగం హెడ్‌ రవికాంతేగౌడ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. అవసరమైతే ఆల్కోమీటర్‌ వాడకుండా వైద్య పరీక్షలు నిర్వహించి జరిమానాలు విధించాలని ఉన్నతాధికారులు సూచించారు.  

కరోనా వైరస్‌పై జాగృతి 
క్రిష్ణగిరి జిల్లా బర్గూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో శనివారం కరోనా వైరస్‌పై చైతన్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్‌ ఆళ్వర్‌స్వామి అధ్యక్షత వహించారు. తమిళనాడు పారిశ్రామిక శిక్షణా సంస్థ, ఆరోగ్య శాఖ, వ్యాధి నివారణ  సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో క్రిష్ణగిరి జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన ప్రిన్సిపల్స్, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ ఉపడైరక్టర్‌ గోవిందరాజు ముఖ్య అతిథిగా పాల్గొని కరోనా వైరస్‌ వ్యాపించడం, దాని వల్ల ఏర్పడే మార్పులు, నివారణ చర్యలపై విద్యార్థులకు వివరించారు. ప్రస్థుతం తమిళనాడులో కరోనా వైరస్‌ వ్యాధి ప్రబలే అవకాశం లేదని, దానిపై ప్రజలు భయాందోళనలు చెందవలసిన అవసరం లేదని సూచించారు. (చదవండి: ‘సార్స్‌’ను మించిన కరోనా)

మరిన్ని వార్తలు