కరోనా: నిఖిల్‌ పెళ్లిపై సీరియస్‌

17 Apr, 2020 14:10 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమార స్వామి-రేవతిల పెళ్లి సందర్భంగా లాక్‌డౌన్‌ నిబంధనలను తుంగలో తొక్కారు. కరోనా మహమ్మారి నివారణకు భౌతిక దూరం పాటించాలని ప్రధాని నుంచి క్రిందిస్థాయి అధికారుల వరకు మొత్తుకుంటున్నా దేవెగౌడ కుటుంబ పట్టించుకోలేదు. పెళ్లికి పెద్ద ఎత్తున బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. వీరంతా ఏమాత్రం భౌతిక దూరం పాటించకుండా గుమిగూడి పెళ్లిని తిలకరించారు. వధువరులతో పాటు ఎవరూ కూడా ముఖానికి మాస్క్‌లు ధరించకపోవడం గమనార్హం. శానిటైజర్లు వాడారో, లేదో తెలియదు. 

లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ పెళ్లిపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. విచారణకు ఆదేశించినట్టు ఉప ముఖ్యమంత్రి అశ్వత్‌నారాయణ తెలిపారు. రామనగర డిప్యూటీ నుంచి నివేదిక కోరినట్టు చెప్పారు. కలెక్టర్‌, ఎస్పీతో కూడా మాట్లాడానని చెప్పారు. వ్యవస్థను అపహాస్యం చేసేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఇందులో రెండో ఆలోచనకు తావులేదన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామికి నిబంధనలు పాటించాలన్న విచక్షణ లేకపోవడం దారుణమని విమర్శించారు. నిఖిల్‌ కుమార స్వామి-రేవతిల పెళ్లిపై సోషల్‌ మీడియాలో నెటిజనులు మండిపడుతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ పెళ్లి తంతు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.

చదవండి: మాజీ సీఎం ఇంట పెళ్లి

మరిన్ని వార్తలు