లాక్‌డౌన్‌ : విషం పెట్టి కోతులను చంపారు

25 Apr, 2020 07:15 IST|Sakshi

చెన్నై : లాక్‌ డౌన్‌ కష్టాలు మూగ జీవాలను వదలి పెట్టడం లేదు. ఆకలితో అన్ని జంతువులు అలమటిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలలో కోతుల బాధలు వర్ణణాతీతం.. వాటికి ఆహారం అందించేవారు కరువయ్యారు. రోడ్డు మీద తిరిగే శునకాలు, వన్యప్రాణులు, పక్షులు, కాకులు ఆకలితో  అలమటిస్తుండటంతో కొంతమంది మానవతాదృక్పథంతో వ్యవహరిస్తూ ఆహారం అందిస్తున్నారు. అయితే ఆకలితో అలమటిస్తున్న కోతులకు విషంపెట్టి హతమార్చడం తిరువణ్ణామలైలో కలకలం రేపింది. మానవత్వాన్ని  మరిచిన కొందరు కిరాతకులు ఆకలితో అలమటిస్తున్న కోతులకు అరటి పండులో విషం పెట్టి చంపారు. తిరువణ్ణామలై అటవీ ప్రాంతంలో ఓ చోట పది కోతులు మరణించి ఉండటాన్ని గిరిజనులు గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు విచారణ చేపట్టారు. అయితే, ఈ కోతులు మరణించి ప్రాంతానికి కూత వేటు దూరంలో అరటి పండ్లు పడి ఉండటంతో వాటిని పరిశీలించగా విషం ఉన్నట్టు గుర్తించారు.ఈ దారుణానికి ఒడిగట్టిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 
(కరోనా : ప్రాణం తీసిన అభిమానం)

>
మరిన్ని వార్తలు