‘అన్నీ మంచి శకునాలే..’

30 Apr, 2020 09:15 IST|Sakshi

కోలుకుంటున్న తమిళనాడు 

రెండుమూడు జిల్లాల్లోనే వైరస్‌,  హిట్‌లిస్ట్‌లో చెన్నై 

 సాక్షి ప్రతినిధి, చెన్నై : అదిగో కరోనా వైరస్‌...ఇదిగో మరణం అనే సమాచారం నుంచి తమిళనాడు బయటపడుతోంది. రెండు మూడు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆగిపోయింది. ‘అన్నీ మంచి శకునములే...’ అంటూ హాయిగా పాడుకునే రోజులు ముందున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. సుమారు మూడు వారాలుగా ఏడు జిల్లాల్లో ఒక్క పాజిటివ్‌ కేసుకూడా నమోదు కాకపోవడం సంతోషకరమైన పరిణామం. నీలగిరి జిల్లాలో 17 రోజులుగా, రాణిపేట జిల్లాలో 15 రోజులుగా, కన్యాకుమారి జిల్లాలో 14 రోజులుగా, ఈరోడ్‌ జిల్లాలో 13 రోజులుగా, వేలూరు, కరూరు, తేనీ జిల్లాల్లో 11 రోజులుగా, కడలూరు జిల్లాలో 9 రోజులుగా, తూత్తుకూడి, శివగంగై, పుదుకోట్టై జిల్లాల్లో 8 రోజులుగా అరియలూరు జిల్లాలో 6 రోజులుగా కొత్తగా ఒక్క కొత్త కేసు కూడా లేదు. (ప్రియుడి కోసం 200 కిమీ.. నడిచి వచ్చేసింది)

కృష్ణగిరి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసుకూడా నమోదు కాలేదు. తంజావూరు జిల్లాలో వైరస్‌ బారిన పడిన 55 మందిలో 33 మంది కోలుకున్నారు. కోయంబత్తూరు జిల్లాలో వ్యాధిగ్రస్తులైన 141 మందిలో 120 డిశ్చార్జ్‌ అయ్యారు. నాలుగురోజులుగా కొత్తగా ఒక్క కేసు రాలేదు. చెన్నై, చెంగల్పట్టు జిల్లాల్లో మాత్రమే కొత్త కేసులు బయపడుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. 2రోజుల క్రితం మూడు జిల్లాల్లో మాత్రమే పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. మంగళవారం నాడు ఐదు జిల్లాలో మాత్రమే కేసులు నమోదయ్యా యి. తమిళనాడులో మంగళవారం 7,093 రక్త నమూనాల ఫలితాలు వెలువడగా కేవలం 121 పాజిటివ్‌ కేసులు తేలాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకూ 2,162 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. (సెల్ ఫోన్ పేలి చూపు కోల్పోయిన యువతి)

చెన్నైతోనే చిక్కులు..
అన్ని జిల్లాలో కరోనావైరస్‌ నుంచి కోలుకుంటుంటే చెన్నైలో మాత్రం పాజిటివ్‌ కేసులు భయపెడుతూనే ఉన్నాయి.  రాష్ట్రంలో మంగళవారం బయటపడిన 121 పాజిటివ్‌ కేసుల్లో 103 చెన్నైకి చెందినవి కావడం, వీరిలో 7 నెలల పసికందుతోపాటూ ఏడుగురు చిన్నారులు కూడా ఉండటం గమనార్హం. అలాగే చెంగల్పట్టు జిల్లాలో ఐదు రోజుల ఆడ పసికందుతో సహా ముగ్గురు చిన్నారులకు సైతం వైరస్‌ సోకింది. మంగళవారం ఒకేరోజున 10 మంది చిన్నారులకు వైరస్‌ నిర్ధారణ అయింది. (చెన్నైలో భయం.. భయం)

మరిన్ని వార్తలు