‘కార్పొరేట్’ చదువే కావాలి !

18 Apr, 2016 02:41 IST|Sakshi

{పభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య
మౌలిక సదుపాయాల లేమి ప్రధాన కార ణం
అప్పైనా ఇంగ్లిషు నేర్పించాల్సిందే

 

బెంగళూరు : హంగు, ఆర్భాటం ఉన్న కార్పొరేట్ పాఠశాలల వైపే విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. పిల్లల చదువుకు ఎంత ఖర్చైనా వెనుకాడటం లేదు. ఇలాంటి పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందనే ఆలోచనా విధానంతో తల్లిదండ్రులు ఎంత ఆర్థిక కష్టాలు ఉన్నా పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండవు. ఉపాధ్యాయుల కొరత, నాణ్యతలేని విద్య ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది తగ్గిపోతోంది. దీంతో సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను ప్రభుత్వాలు మూసివేసే దిశగా చర్యలుచేపడుతున్నాయి. 

 
సాక్షాత్తు సర్వశిక్ష అభియాన్ (కర్ణాటక) గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయాలు అర్థమవుతాయి. 2014-15 ఏడాదిలో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల సంఖ్య 27.35 లక్షలు ఉండగా 2015-16 ఏడాదిలో ఆ సంఖ్య 26.83 లక్షలకు తగ్గి పోయింది. అదేవిధంగా ఒకటి నుంచి ఎనిమిది మధ్య విద్యార్థుల సంఖ్య 42.21 లక్షలు ఉండగా 2015-16లో సంఖ్య 41.09 ఇక ఒకటి  నుంచి పదోతరగతి విద్యార్థుల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపించింది. 2014-15లో విద్యార్థుల సంఖ్య 48.64 లక్షలు కాగా, 2015-16లో ఆ సంఖ్య 47.45. ఇలా ఇటు అడ్మిషన్లు కరువవడంతో పాటు ఉన్న విద్యార్థులు కూడా టీ.సీ తీసుకుని ప్రైవేటు పాఠశాలల్లో చేరిపోతున్నారు. దీంతో ఒక పాఠశాలను మరో పాఠశాలతో కలిపివేయడం లేదా అసలు అక్కడ ప్రభుత్వ పాఠశాలే లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోంది. దీంతో రాష్ట్రంలోని ప్రభత్వ పాఠశాలల సంఖ్య కూడా ఏడాదికేడాది తగ్గిపోతోంది.

 
తల్లిదండ్రుల ఆలోచనా విధానం... అటుపై ఆర్టీఈ కూడా!

తమ బిడ్డలు ఇంగ్లిషులో మాట్లాడేయాలని నేటి తరం తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అంతేకాదు ఏబీసీడీలు నేర్చుకునే వయసులోనే కంప్యూటర్లను ఆపరేట్ చేయాలని ఉత్సాహపడుతున్నారు. ఇందు కోసం ఎంత ఖర్చయినా వెనుకాడటం లేదు. సంపాదనలో దాదాపు 40 శాతం వరకూ పిల్లల చదువులకే ఖర్చుపెట్టే తల్లిదండ్రులు ఉన్నారంటే ప్రైవేటు చదువులపై ఎంత మోజో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదవి పిల్లలు పట్టణాలకు వస్తూ ఇక్కడి కార్పొరేట్ పాఠశాల్లో చేరుతున్నారు. ఇదిలా ఉండగా  విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు ఆర్టీఈ కింద ప్రైవేటు పాఠశాలల్లో సీటు దక్కితే ప్రస్తుతం చదువుతున్న ప్రభుత్వ పాఠశాలను వదిలి ప్రైవేటు పాఠశాల్లో చేరుతున్నారు. ఈ కారణలన్నింటి వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా మూతపడుతున్నాయి.

>
మరిన్ని వార్తలు