ముగిసిన కార్పోరేషన్ సమావేశాలు

17 Sep, 2016 01:10 IST|Sakshi

వేలూరు: వేలూరు కార్పోరేషన్ సమావేశాలు దాదాపుగా ముగిసిపోయాయి. అత్యవసర ఆఖరి సమావేశంలో అన్నాడీఎంకే కార్పోరేటర్లు 70 తీర్మాణాలను ప్రవేశపెట్టి వాటిని నెరవేర్చారు. కార్పోరేషన్ అత్యవసర సమావేశం శుక్రవారం ఉదయం మేయర్ కార్తియాయిని అధ్యక్షతన జరిగింది. సమావేశంలో అన్నాడీఎంకే కార్పోరేటర్ సెల్వం మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కుట్టమేడు ప్రాంతంలోని ప్లాస్టిక్‌ను పూర్తిగా తొలగించాలని వీటి వల్ల అక్కడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. అదే విధంగా వీధుల్లో కుక్కల బెడద అధికంగా ఉందన్నారు. ఇందుకు మేయర్ వీటిపై వెంటనే చర్యలు తీసుకొని తొలగిస్తామన్నారు.
 
 కార్పోరేటర్ అన్వర్ బాషా మాట్లాడుతూ తమ వార్డులోని రెండు పోలీస్ కేంద్రాలు పలు సంవత్సరాలుగా మూసి ఉండడంతో తరచూ చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మేయర్ కార్తియాయిని కలగజేసుకొని త్వరలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు కుదరదని ఇన్ని రోజుల పాటు తనతో పాటు పనిచేసిన కార్పోరేటర్లు అందరికీ ధన్వ వాదాలు తెలిపారు. తమ పాలనలో సదుప్పేరి చెత్త కుప్పల గిడ్డంగికి పరిష్కారం చూపడం జరిగిందని, 2012లో కార్పోరేషన్‌కు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం జరిగిందన్నారు.
 
 అనంతరం సమావేశంలో 70 తీర్మాణాలను సభ్యులు నెరవేర్చారు. ఈ సమావేశంలో కమిషనర్ కుమార్, డిప్యూటీ మేయర్ చొక్కలింగం, నాలుగు డివిజన్‌ల అసిస్టెంట్ కమిషనర్‌లు పాల్గొన్నారు. డీఎంకే, కాంగ్రెస్ కార్పోరేటర్లు గైర్హాజరు: సమావేశం నిర్వహించేందుకు 24 గంటలు మందుగా సమాచారం ఇవ్వాలని, అయితే గురువారం అర్థరాత్రి సమయంలో తమకు సమాచారం అందడంతో తాము సమావేశానికి హాజరు కావడం లేదని డీఎంకే, కాంగ్రెస్ కార్పొరేటర్లు తెలిపారు. అదే విధంగా శుక్రవారం బంద్ ఉండడంతో అత్యవసర సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారని పలువురు కార్పోరేటర్‌లకు అర్థంకాని పరిస్థితి నెలకొంది. దీంతో సమావేశ మందిరం కార్పోరేటర్లు లేక వెలవెలబోయింది.
 

మరిన్ని వార్తలు