అంతా అవినీతే

29 Mar, 2014 04:39 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెళ్లిన చోటల్లా, అవినీతి గురించి ఉపన్యాసాలు దంచేస్తున్నారని, తీరా ఆయన మంత్రి వర్గంలోనే అత్యంత అవినీతి పరులున్నారని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ విమర్శించారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

తన మంత్రి వర్గంలో ఉన్న అవినీతి పరులపై ముఖ్యమంత్రి మొదట దృష్టి సారిస్తే మంచిదని సూచించారు. మంత్రి డీకే. శివ కుమార్‌కు అనేక అవినీతి కుంభకోణాలలో సంబంధం ఉందనే విషయం ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. ఆయనపై సీబీఐ లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ చేత దర్యాప్తు జరిపించడానికి ఎవరు అడ్డు పడుతున్నారని ప్రశ్నించారు.

అవినీతి విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకే నాణేనికి రెండు ముఖాలు వంటివని విమర్శించారు. కాగా దక్షిణ కన్నడ స్థానాన్ని మిత్ర పక్షానికి కేటాయించామని, కొప్పళలో కాంగ్రెస్‌కు మద్దతునిస్తామని చెప్పినట్లు వస్తున్న వార్తలు నిరాధారమని తెలిపారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
 
‘ఆప్’ను తేలికగా తీసుకోవడం లేదు

 
లోక్‌సభ ఎన్నికల్లో తాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని తక్కువగా పరిగణించడం లేదని ఆయన తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా లోక్‌సభలో గళమెత్తడానికి ఆ పార్టీ యువకులను బరిలో దింపిందని చెప్పారు. కాగా రాష్ర్టంలో బీజేపీ కేవలం నరేంద్ర మోడీ ఆకర్షణపై ఆధారపడి ఉందన్నారు. తద్వారా 23 సీట్లు గెలుస్తామనే అంచనాలో ఉందని తెలిపారు. మరో వైపు జేడీఎస్ ఒక సీటు కూడా గెలవకుండా చూస్తామని సీఎం ప్రకటిస్తున్నారని అన్నారు. వీటినంతా గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు ఎలాగో తీర్పు ఇవ్వనున్నారు కనుక మే 16 వరకు వేచి చూడాలని ఆయన సూచించారు.
 

మరిన్ని వార్తలు