పెద్దపల్లిలో పత్తి రైతుల ఆందోళన

14 Feb, 2017 16:48 IST|Sakshi
పెద్దపల్లి: వ్యాపారులు సరైన ధర చెల్లించటం లేదంటూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక మార్కెట్‌కు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మంగళవారం దాదాపు 200 మంది రైతులు సుమారు 5000 బస్తాల పత్తిని తీసుకువచ్చారు. ఉదయం కొనుగోళ్లు ప్రారంభం అయిన తర్వాత క్వింటాలుకు రూ.5,300 వరకు వ్యాపారులు ధర చెల్లించారు. అయితే, ఆ తర్వాత ట్రేడర్లు గ్రేడును బట్టి రూ. 5100 అంతకంటే తక్కువ మాత్రమే చెల్లిస్తామంటూ మొండికేసుక్కూర్చున్నారు.
 
దీంతో రైతులు ఆందోళన ప్రారంభించారు. కొనుగోళ్లు నిలిపివేశారు. రైతుల ధర్నాతో ఎస్సై శ్రీనివాస్‌ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. మద్దతు ధర రూ.4,800 కంటే తక్కువ చెల్లిస్తే తాను వ్యాపారులతో మాట్లాడి ఒప్పిస్తానని శ్రీనివాస్‌ భరోసా ఇచ్చారు. అయితే, శనివారం వరకు రూ.5600 వరకు పలకగా రెండు రోజుల్లోనే పడిపోవటం ఏమిటని రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అయిలయ్య, ఎస్సై శ్రీనివాస్‌ రైతులు, ట్రేడర్లను సమావేశపరిచి చర్చలు సాగిస్తున్నారు.
 
మరిన్ని వార్తలు